కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్​ నివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్​ నివాళి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాధన కోసం, బలహీనవర్గాల కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ మనమంతా గర్వించే గొప్ప నేత అని సీఎం కేసీఆర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం ఘన నివాళి అర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే, చాకలి ఐలమ్మతో సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేశారన్నారు.

తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్ఫూర్తి, మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ఉద్యానవన విశ్వ విద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో అవార్డులను అందజేస్తూ, చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని తెలిపారు.