దద్దరిల్లిన బెంగాల్‌‌ అసెంబ్లీ: టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ, తోపులాటలు

దద్దరిల్లిన బెంగాల్‌‌ అసెంబ్లీ: టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ, తోపులాటలు

కోల్‌‌కతా: వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ గురువారం ఈడ్చివేతలు, తోపులాటలు, జై శ్రీ రామ్ నినాదాలు, అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రమైన మాటల యుద్ధంతో సభ అట్టుడికిపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  బెంగాలీ వలస కార్మికులపై దాడులను ఖండిస్తూ చేసిన తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. 

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ వ్యతిరేకులు. బెంగాలీలపై దాడులపై, వేధింపులపై అసెంబ్లీలో  చర్చలను బీజేపీ అడ్డుకుంటున్నది. ఓటు దొంగల పార్టీ" అని అన్నారు. దీంతో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం సభలో గందరగోళాన్ని సృష్టించింది. బీజేపీ సభ్యులు సభా కార్యకలాపాలను స్తంభింపజేయడానికి వెల్‌‌లోకి దూసుకెళ్లారు. దాంతో స్పీకర్ బిమన్ బెనర్జీ ఆదేశాల మేరకు మార్షల్స్ పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. 

బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ చీఫ్ విప్ డాక్టర్ శంకర్ ఘోష్‌‌ను రోజంతా సస్పెండ్ చేశారు. ఘోష్ సభ నుంచి వెళ్లడానికి నిరాకరించడంంతో మార్షల్స్‌‌ వచ్చి ఆయనను బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ గందరగోళంలో ఆయన స్పృహ తప్పారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్ విసురుకోవడంతో పలువురికి గాయాలు కూడా అయ్యాయి.