ఇటు సీఎం.. అటు మంత్రులు

ఇటు సీఎం.. అటు మంత్రులు
  •     ఎంపీ ఎన్నికల్లో ఉత్సాహంగా నేతల ప్రచారం
  •     నామినేషన్ ర్యాలీలు,కార్నర్ మీటింగ్​లతో కాంగ్రెస్ దూకుడు
  •     అభ్యర్థుల విజయానికి మండుటెండల్లో సైతం ఇంటింటా ప్రచారం
  •     ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంత్, ఆయా లోక్ సభ స్థానాలకు ఇన్​చార్జ్​లుగా ఉన్న మంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాలుగు రోజులుగా సీఎం రేవంత్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతూ.. ర్యాలీల్లో, కార్నర్ మీటింగ్ లలో, పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొంటూ దూకుడు పెంచారు. రేవంత్ ప్రతి రోజు రెండు లోక్ సభ నియోజకవర్గాలకు వెళ్తూ పార్టీ క్యాడర్​లో జోష్ నింపుతున్నారు. 

ఇన్​చార్జ్ లుగా ఉన్న మంత్రులు, నేతలు ఆయా నియోజకవర్గాల్లో మకాం వేసి అభ్యర్థులను వెంటబెట్టుకొని ప్రచారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో రేవంత్ మహబూబ్ నగర్, మహబూబాబాద్, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో, బుధవారం సికింద్రాబాద్, వరంగల్ లో నిర్వహించనున్న ప్రచారంలో పాల్గొననున్నారు.

భారమంతా భుజాలపై వేసుకున్న మంత్రులు

మంత్రులు తమకు కేటాయించిన లోక్ సభ నియోజకవర్గాల్లోనే ఉంటూ పార్టీ నేతలను, క్యాడర్ ను ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులను వెంటబెట్టుకొని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సీటు ఇంన్​చార్జ్​గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గెలుపు కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ ఎమ్మెల్యేలను, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపారు. 

నేతలందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇన్​చార్జ్​గా ఉన్నా.. సీఎం రేవంత్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్న రేవంత్, మంగళవారం మరోసారి కొడంగల్ వెళ్లనున్నారు. తన సొంత జిల్లా, తను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సీటు ఉన్న లోక్​సభ స్థానం కావడంతో ఇక్కడి అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపు విషయాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. నల్గొండ పార్లమెంట్ సీటులో సీనియర్ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషిచేస్తున్నారు.  

చామల గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ 

భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని స్పీడప్ చేశారు. విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ చామలను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్ ఇన్​చార్జ్​గా ఉన్నప్పటికీ భువనగిరిలో కూడా చామల గెలుపు కోసం పనిచేస్తున్నారు. మెదక్ అభ్యర్థి నీలం మధు గెలుపును మంత్రి కొండ సురేఖ చాలెంజ్ గా తీసుకొని పని చేస్తున్నారు. ఆదిలాబాద్​లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించే బాధ్యతను మంత్రి సీతక్క తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సుగుణను రాజీనామా చేయించి, పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడంలో సీతక్క కీలకంగా వ్యవహరించారు. 

ఇప్పుడు ఆమె గెలుపు భారాన్ని కూడా సీతక్క పూర్తిగా తన భూజాలపై వేసుకొని ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్ స్థానానికి ఇన్ చార్జ్​గా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.  కరీంనగర్ అభ్యర్థిని ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావును వెంటపెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. సీఎం రేవంత్.. మంత్రులు తమ సమావేశాలు, ర్యాలీలతో క్యాడర్​లో జోష్ తీసుకువస్తున్నారు. దీంతో ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల కన్నా కాంగ్రెస్ పైచేయి సాధించినట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు.