క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం : రేవంత్

క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం : రేవంత్

కంటోన్మెంట్, వెలుగు: కృషి, పట్టుదలకు క్రమశిక్షణ తోడైతే జీవితంలో ఏదైనా సాధించగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించారు. దాన్ని చేరుకునేందుకు పట్టుదలతో ముందుకు వెళ్లాలన్నారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టం చేశారు. గురువారం సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకకు రేవంత్ చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. స్నాతకోత్సవానికి అటెండ్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్​లోని ప్రతి స్టూడెంట్​ను అభినందిస్తున్నట్టు తెలిపారు. కృషి, అంకితభావమే ఇక్కడికి దాకా తీసుకొచ్చాయని చెప్పారు. స్టూడెంట్స్ అందరూ ఇక నుంచి కొత్త జర్నీ ప్రారంభించబోతున్నారని వివరించారు. ఈ ప్రయాణంలో అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సక్సెస్​ను ఆస్వాదిస్తూనే.. బాధ్యాతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. చేసే పని.. కుటుంబానికి, కాలేజ్​కు గుర్తింపు తీసుకొచ్చేలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్టూడెంట్స్​కు డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.