నేనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‎కు వస్తా.. అక్కడే చర్చిద్దాం: సీఎం రేవంత్

నేనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‎కు వస్తా.. అక్కడే చర్చిద్దాం: సీఎం రేవంత్

హైదరాబాద్:  కృష్ణా, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీర్ అసెంబ్లీకి రావాలని.. ఆయన విలువైన సూచనలు, సలహాలు చేస్తే కచ్చితంగా పాటిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను మాటిస్తున్నా.. సభలో కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటానన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు నిమ్మలంగా చర్చిద్దామన్నారు.  బుధవారం (జులై 9) ప్రజా భవన్‎లో కృష్ణా, గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పీపీటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ఎక్కడికైనా వస్తానని కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. కేసీర్ ఆరోగ్యం బాగోలేదంటే మేమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‎కి వస్తాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‎లో మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేద్దాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ప్రజాప్రతినిధుల సభకు అవసరమైతే నేను కూడా వస్తా. 

అంతేకానీ క్లబ్బులు, పబ్బులు అంటే మొదటి నుంచి మేం కొంచెం దూరం. దయచేసి నన్ను క్లబ్బుల, పబ్బులకు పిలవొద్దని అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ సమావేశం పెడతామని.. ఆయన అసెంబ్లీకి వస్తే ప్రభుత్వ చర్యలను వివరిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.