సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ(ఫిబ్రవరి 14)కీలక సమావేశం జరగనుంది. రేవంత్ నివాసంలో సాయంత్రం జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో విజయం, పలు చోట్ల ఓటమి, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు,కార్పొరేషన్ ఛైర్మన్ల ఎంపికపై చర్చించనున్నారు. హంగ్ వచ్చిన చోట అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేయనున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార పార్టీ హవా కొనసాగింది. 85 మున్సిపాలిటీలను హస్తం పార్టీ చేజిక్కించుకున్నది. మరో10 చోట్ల ఇండిపెండెంట్లు, ఎంఐఎం, ఇతర పార్టీల తరఫున గెలిచిన అభ్యర్థుల మద్దతుతో చైర్పర్సన్పీఠాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో మేయర్ పీఠాలు దక్కించుకోనున్నది. కొత్తగూడెంలో సీపీఐతో కలిసి పాగా వేసేందుకు పావులు కదుపుతున్నది. ముఖ్యంగా నిజామాబాద్‌లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 15 మున్సిపాలిటీలకే పరిమితమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల, ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ స్థానమైన గజ్వేల్ మున్సిపాలిటీలను కాపాడుకున్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ చావు దెబ్బ తిన్నది. ఏడు కార్పొరేషన్లలో ఒక్కచోట కూడా ఆశించిన సీట్లను దక్కించుకోలేక చతికిలపడింది. పోయినసారి పదికి పది కార్పొరేషన్లు గెలుచుకున్నా ఆ పార్టీ ఈ సారి ‘జీరో’గా మిగిలిపోయింది.
