హైదరాబాద్, వెలుగు: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌లో క్లాసుల విరామ సమయంలో అక్కడి ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. హార్వర్డ్ వైస్ ప్రొవోస్ట్, హార్వర్డ్- ఎక్స్ హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్‌లీ, కెన్నెడీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెరెమీ వైన్‌స్టెయిన్ తో సమావేశమైన సీఎం.. విద్యా ప్రమాణాల పెంపుపై చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను సీఎం వారికి వివరించారు. విద్యా రంగంలో కలిసి పని చేసేందుకు సహకరించాలని సీఎం కోరగా ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి అవసరమైన విద్యా విధానాలు, ప్రక్రియలపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ఆధునిక నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి పాత్ర వంటి అంశాలపై సీఎం వారితో చర్చించారు.
