రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయండి.. నిత్యవసరాల కొరత లేకుండా చూడండి: CM రేవంత్

రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయండి.. నిత్యవసరాల కొరత లేకుండా చూడండి: CM రేవంత్

హైదరాబాద్: భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆపరేషన్ సిందూర్, సివిల్ మాక్ డ్రిల్ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో బుధవారం (మే 7) అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై  అధికారులకు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయాలని.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని.. రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులు, విదేశీ రాయబార కార్యాలయాలు, కేంద్ర రక్షణరంగ సంస్థల వద్ద భద్రతను పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

►ALSO READ | ప్రజలు భయపడొద్దు.. అవగాహన కోసమే మాక్ డ్రిల్: సీపీ ఆనంద్

విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యవసరాల సమకూర్పుపై ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాము 24/7 అందుబాటులో ఉంటామని.. అధికారులు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపించాలని ఆదేశించారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలతో రాష్ట్ర నిఘా వర్గాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.