వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

వారం, 10  రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!
  • మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్‌‌‌‌ చేసిన సీఎం, పీసీసీ చీఫ్
  • ఎలక్షన్స్‌‌‌‌కు సిద్ధం కావాలని దిశానిర్దేశం
  • పెండింగ్ పనులను పరిష్కరించాలని సూచన
  • ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మరో వారం, పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్ అలర్ట్ చేశారు. ఈ లోపే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌‌‌‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన  పూర్తి చేయాలని ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా తమను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్‌‌‌‌ పలు సూచనలు చేస్తూ.. వారిని అప్రమత్తం చేస్తున్నారు.

సిటీలో, పట్టణాల్లో గత కొంత కాలంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న  సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రులు కూడా దీనిపై దృష్టిపెట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి వస్తున్న ఇలాంటి సమస్యలపై వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మెజార్టీ వార్డులను  దక్కించుకోవాలి

మున్సిపాలిటీల పరిధిలో  పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని, చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం, పీసీసీ చీఫ్‌‌‌‌ సూచించారు. సిటీ, పట్టణ ప్రజల నుంచి వస్తున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్లు , వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు,  స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, నల్లా నీళ్లు..ఇలా  ప్రజలను నిత్యం  ఇబ్బందులు పెడుతున్న సమస్యలను త్వరితగతిన గుర్తించి, పరిష్కరించాలని  సూచించారు.

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జీలు తమ పరిధిలోని పట్టణాలపై ఈ వారం, పది రోజులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, డివిజన్లలో, వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని  ఆదేశించారు.  ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులను  కాంగ్రెస్ దక్కించుకునేలా ఇప్పటి నుంచే ఇటు పార్టీ బలోపేతంపై, అటు ప్రజా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జీలను సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరారు.

పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను మించి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు సీట్లు రావాలన్నారు. ఈ ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చినట్టు సమాచారం.