ఎస్సారెస్పీ-ఫేజ్‌‌‌‌ 2కు రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పేరు..24 గంటల్లో జీవో తెస్తం: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

ఎస్సారెస్పీ-ఫేజ్‌‌‌‌ 2కు రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పేరు..24 గంటల్లో జీవో తెస్తం: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  •     దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశం 
  •     దామన్న వల్లే నల్గొండ జిల్లాకు గోదావరి నీళ్లు
  •     ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభివృద్ధికి కృషిచేశారని వెల్లడి
  •     దామోదర్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరు

సూర్యాపేట, వెలుగు: ఎస్సారెస్పీ ఫేజ్‌‌‌‌ 2 ప్రాజెక్టుకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేరు పెడతామని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి  24 గంటల్లో జీవో తెస్తామని చెప్పారు. నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని పేర్కొన్నారు.  ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన మాజీ మంత్రి దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌‌‌‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరమడంలో దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఎస్సారెస్పీ ఫేజ్ - 2 ప్రాజెక్టుకు ఆర్డీఆర్ (రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి) ఎస్సారెస్పీ 2 గా నామకరణం చేస్తామని, ఇదే ఆయనకు ఇచ్చే నివాళి అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ పూడికతీత , కాలువల లైనింగ్ పనులను చేపడతామని చెప్పారు. 

దామన్న ఫ్యామిలీకి కాంగ్రెస్​ అండగా ఉంటది

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభివృద్ధికి, నమ్ముకున్న కార్యకర్త కోసం దామన్న ఎంతో చేశారని, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్నారని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి, ఎంతోమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ 1985తో కమ్యూనిస్టు కంచుకోట అయిన తుంగతుర్తిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారని, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కేబినెట్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసి తుంగతుర్తి, సూర్యాపేట అభివృద్ధిలో పాలుపంచుకున్నారని గుర్తు చేశారు. 

రూ. 50 వేలు కూడా లేకుండా తుంగతుర్తి నుంచి పోటీచేసిన మందుల సామేల్.. ఆర్డీఆర్ కృషి వల్లే 52 వేల మెజార్టీతో గెలిచారని తెలిపారు.  దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫ్యామిలీకి కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని సోనియా చెప్పారని సీఎం పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి మృతికి ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం తెలియజేస్తూ లేఖలు పంపారని తెలిపారు. రాబోయే రోజుల్లో దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కొడుకు సర్వోత్తమ్ రెడ్డికి రాజకీయంగా అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు.  

కాంగ్రెస్ అంటేనే దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి: భట్టి

కాంగ్రెస్ అంటేనే దామోదర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అని, పార్టీ కోసం నిలబడి కొట్లాడారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాను చదువుకునే రోజుల్లోనే ఆయన ప్రజల్లో ఆదర్శ నాయకుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, పేదల సంక్షేమం కోసం దామోదర్ రెడ్డి అనేక పోరాటాలు చేశారని చెప్పారు.  తుంగతుర్తిని, ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేయడానికి దామోదర్ రెడ్డి కృషి చేశారని తెలిపారు. 

రాష్ట్రంలో  దశాబ్దంపాటు మరో పార్టీ ఉన్నా.. ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్‌‌‌‌లోనే కొనసాగారని, ఎన్నో పార్టీలు ఒత్తిడి చేసినా కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. తన పాదయాత్రలో వయసును కూడా లెక్కచేయకుండా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.