ఇంటి పెద్ద మరణిస్తే.. కుటుంబం వీధిన పడకూడదనే బీమా

ఇంటి పెద్ద మరణిస్తే.. కుటుంబం వీధిన పడకూడదనే బీమా
  •   ఉద్యోగుల సంక్షేమమే 
  • మా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి 
  •     విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు 
  • రూ. కోటి చొప్పున చెక్కుల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: సీపెక్ సర్వే ప్రకారం గుర్తించిన కుటుంబాలన్నింటికీ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని, కుటుంబ పెద్ద మరణిస్తే..ఆ కుటుంబమంతా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఈ స్కీమ్ తెచ్చినట్లు వివరించారు. సోమవారం అసెంబ్లీ హాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిసి రూ. కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడకూడదనే మానవీయ కోణంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 1.20 కోట్ల భారీ ప్రమాద బీమాను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం ఎదుర్కొనే నిస్సహాయ స్థితిని తాము గమనించామన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ సంస్థల్లోని 51 వేల మందికి పైగా, సింగరేణిలో 41 వేల మంది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భరోసా లభిస్తుందని వివరించారు. 2025 అక్టోబర్‌లో డ్యూటీలో మరణించిన అసిస్టెంట్ లైన్‌మెన్ వరుస సురేశ్, ఏప్రిల్‌లో మరణించిన ఆర్టిజన్ ముక్తార్ బేగ్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్కులను అందజేశామన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, మహ్మద్ అజారుద్దీన్, ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.