హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీతోపాటు సిటీ నుంచి బయటకు వెళ్లాలంటే ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీ తప్పటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026, మార్చి 23వ తేదీన శాసన మండలిలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలు.. రాబోయే ప్రాజెక్టులకు సంబంధించి కీలకమైన విషయాలు వెల్లడించారు.
సిటీ నుంచి సిటీ బయటకు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని.. దీనికితోడు ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదన్నారు. భవిష్యత్ లో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సిటీ వెలుపల అభివృద్ధికి అద్భుతమైన ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారాయన.
సిటీ చుట్టూ నాలుగు ఎలివేటెడ్ కారికార్ల నిర్మాణానికి ప్రణాళిక రెడీ చేసినట్లు వివరించారు సీఎం. గౌలిగూడ జంక్షన్ దగ్గర ఒకటి.. చాదర్ ఘాట్ జంక్షన్ లో మరొక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టన్నట్లు ప్రకటించారాయన.
అదే విధంగా నాగోలు దగ్గర ఒకటి.. అంబర్ పేట జంక్షన్ దగ్గర మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో.. సిటీ నుంచి నేరుగా సిటీ బయటకు.. ఈజీగా వెళ్లొచ్చన్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూసేకరణ చాలా చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని.. సిగ్నల్స్ లేకుండా సిటీ బయటకు ఈజీగా వెళ్లిపోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ సిటీకి నలువైపులా.. నాలుగు చోట్ల ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో సిటీలోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని.. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు వరకు సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
