- విద్యాశాఖపై పెట్టేది ఖర్చు కాదు.. రేపటి తరాల కోసం ఇన్వెస్ట్‌మెంట్
- స్టూడెంట్లకు ఇచ్చే కిట్లలో నాణ్యత లేకుంటే కంపెనీలపై కేసులు పెడ్తం
- వచ్చే ఏడాది నుంచి బడిలోనే బ్రేక్ ఫాస్ట్.. మిడ్డే మీల్స్‌లో చికెన్, మటన్, ఫిష్
- 1,011 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో చదివే 19 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే ఉన్నదని, ఆ పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్ అనాథ శరణాలయాలు కావని, అవి అభివృద్ధి వేదికలని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ఇచ్చే వాటాను విడతలవారీగా పెంచుతామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న 8.22 శాతాన్ని క్రమంగా 15 శాతానికి చేరుస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా విద్యాశాఖ నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.1,011 కోట్లతో క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
వాటితోపాటు విద్యాసంస్థల్లో వసతులు కలుపుకొని మొత్తంగా రూ.1,700 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. విద్యాశాఖపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిని భవిష్యత్తు తరాల కోసం పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతని, అందుకే తండాలు, గూడేల్లోని దళిత, గిరిజన బిడ్డలకు విద్యను చేరువ చేసేందుకు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నానని స్పష్టం చేశారు.
- కొత్త పాలసీ.. నర్సరీ నుంచి 12 వరకు..
మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏఐలాంటి సాంకేతికతను జోడించి కొత్త విద్యా విధానాన్ని తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పదో తరగతి తర్వాత పేద విద్యార్థులు డ్రాపౌట్స్ కాకుండా ఉండేందుకు, ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందిస్తామని వెల్లడించారు. మరోపక్క వచ్చే విద్యాసంవత్సరం నుంచి పిల్లలను పేరెంట్స్ రెడీ చేసి పంపిస్తే చాలని.. బడుల్లోనే క్వాలిటీ బ్రేక్ ఫాస్ట్, మిడ్డే మీల్స్ అందిస్తామని చెప్పారు.
కొడంగల్‌లో బ్రేక్ ఫాస్ట్ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని, వచ్చే ఏడాది నుంచి రాష్ట్రమంతా అమలు చేస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనంలోనూ గుడ్లు, చికెన్, మటన్‌తోపాటు చేపలను కూడా మెనూలో చేరుస్తామని వెల్లడించారు. పిల్లలకు ఓ రోజు పాలు, మరోరోజు రాగిజావ అందిస్తామన్నారు. సర్కారు బడి అంటే తల్లి ఒడి లాంటిదని, అక్కడ ఏ బిడ్డా ఆకలితో ఉండకూడదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
- ప్రైవేటుకు దీటుగా సర్కారు స్కూళ్లు
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల మంది చదువుతుంటే, 12 వేల ప్రైవేట్ స్కూళ్లలో 38 లక్షల మంది ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సర్కారీ బడుల్లో ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారని గుర్తుచేశారు. ‘‘ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న గొప్పతనం ఏంటి? మన దగ్గర ఉన్న లోపం ఏంటి?’’ అని టీచర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
యంగ్ ఇండియా స్కూల్ విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించి, ప్రైవేటు కంటే మెరుగ్గా ఉండాలని, ఇక్కడి నుంచే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు,ఇంజినీర్లు రావాలని తన కల అని చెప్పారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యారంగంలోనూ అనేక మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందని, ఈనేపథ్యంలో మన రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్టుగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీనీ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. విద్యారంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
- కిట్ల నాణ్యత తగ్గితే క్రిమినల్ కేసులు..
ఈ ఏడాది నుంచి విద్యార్థులకు వివిధ వస్తువులతో కిట్లను అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఎడ్యుకేషన్ కిట్ల కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని, కిట్లలోని బ్లాంకెట్స్, టవల్స్, యూనిఫాం నాణ్యతను తానే స్వయంగా పరిశీలించానని తెలిపారు. వస్తువుల నాణ్యతలో రాజీ పడితే ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టిస్తానని, క్రిమినల్ కేసులు పెడ్తామని హెచ్చరించారు. ఎవరికైనా క్వాలిటీ సరిగా రాకపోతే మీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
స్కూల్ ప్రారంభం రోజే ఒక జత, నెలలోపు మరో జత యూనిఫాం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమాల్లో విద్యార్థుల పాత్రను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష ఎదురైనప్పుడు 1969, 2009 ఉద్యమాలను వర్సిటీ విద్యార్థులే భుజాన వేసుకున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడిన విద్యార్థుల కష్టానికి ప్రతిఫలంగానే నేడు తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. అందుకే మన వర్సిటీలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
- విద్యతోనే ఉన్నత శిఖరాలకు: మంత్రి పొన్నం
వ్యక్తి అభివృద్ధికి కులం, మతం, డబ్బు కారణం కాదని, కేవలం విద్యతోనే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు చేరుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సర్కారు బడులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సర్కారు ఉద్యోగాలు, పథకాలు కావాలని కోరుకుంటున్న జనం.. ప్రభుత్వ విద్య, వైద్యం అంటే విముఖత చూపుతున్నారని తెలిపారు. ఈ నెగిటివిటీ పోవాలని, పేరెంట్స్ వైఖరిలో మార్పు రావాలన్నారు. తన హుస్నాబాద్ సెగ్మెంట్‌లో సర్కారు బడుల బలోపేతానికి ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీలు వేశామని, ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటూ విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నామని వెల్లడించారు.
- విద్యకు ప్రయార్టీ: శ్రీధర్ బాబు
విద్యకు తెలంగాణ సర్కారు మంచి ప్రయార్టీ ఇస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మానవ వనరులను పెద్ద సంఖ్యలో వృద్ధి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. టీచర్ల కొరత ఉండొద్దని, సర్కారు రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. సర్కారు బడుల బలోపేతానికి టీచర్లు కృషి చేయాలని కోరారు.
