- ఆయన ఇచ్చిన సలహా వల్లే బనకచర్లకు పునాది
- అక్కడ కాళేశ్వరం.. ఇక్కడ పాలమూరు.. ప్రాజెక్టు సోర్స్‌లు మార్చి దోపిడీ
- కాళేశ్వరం అంచనాలు రూ.38,500 కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంపు
- పాలమూరు అంచనాలు రూ.32,800 కోట్ల నుంచి 90 వేల కోట్లకు..
- పాలమూరు ప్రాజెక్టులో రూ.55 వేల కోట్లు కొల్లగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్
- డీపీఆర్ లేకుండానే రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారు
- తెలంగాణ నీటి హక్కులపై రాజీపడేది లేదు
- బతికినా.. సచ్చినా తెలంగాణ కోసమేనని వెల్లడి
- కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గొంతు కోసిన పాపం కచ్చితంగా కేసీఆర్‌దేనని, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన చారిత్రక అన్యాయానికి ఆయనే బాధ్యుడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘నేను చంద్రబాబుతో స్వయంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపించాను. నాపై ఉన్న గౌరవంతోనే బాబు ఆ పనులు ఆపారు. దీనిపై అవసరమైతే ఏ నిజ నిర్ధారణకైనా నేను సిద్ధం’’ అంటూ సవాల్ విసిరారు.
కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల అటు గోదావరి, ఇటు కృష్ణా బేసిన్లలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. గతంలో బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన కూడా కేసీఆర్ ఇచ్చిన సలహా వల్లే చంద్రబాబు చేశారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు.
‘‘ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా రూ.55 వేల కోట్లు కొల్లగొట్టాలన్నదే కేసీఆర్ మాస్టర్ ప్లాన్. కనీసం డీపీఆర్ లేకుండానే పాలమూరులో రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చినట్టే.. ఇక్కడ కమీషన్ల కక్కుర్తి కోసం జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు ప్రాజెక్టును మళ్లించారు.
దీనివల్ల అక్కడ అంచనాలను రూ. 38,500 కోట్ల నుంచి లక్ష కోట్లకు, ఇక్కడ రూ.32,800 కోట్ల నుంచి ఏకంగా రూ.90 వేల కోట్లకు పెంచేసి ఖజానాను కొల్లగొట్టారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని ద్రోహాలు చేసి, ఇప్పుడు తమ చిత్తశుద్ధినే శంకిస్తారా? అని మండిపడ్డారు. తన జీవితం తెలంగాణకే అంకితమని.. బతికినా, సచ్చినా తెలంగాణ కోసమేనని ప్రకటించారు. కృష్ణా జలాలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
నీటి హక్కులపై రాజీపడేది లేదు..
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘నేను ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజల హక్కులకు ఏమాత్రం భంగం కలగనియ్యను. సచ్చినా సరే తెలంగాణ కోసమే చస్తాం.. బతికినా తెలంగాణ కోసమే బతుకుతాం తప్ప.. నా ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు.
రాష్ట్ర అభివృద్ధి, నీటి వాటాల విషయంలో అందరం ఏకాభిప్రాయంతో పనిచేస్తాం. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి హక్కుల కోసం చివరి వరకు పోరాడుతాం’’ అని తేల్చి చెప్పారు.
కేవలం తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్నదే తన ఏకైక ఆలోచన అని, ఇందులో రాజకీయాలకు తావులేదన్నారు. ఏపీ చేస్తున్న జలదోపిడి అంచనా వేయలేనంతగా ఉందని, అయితే తాను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడితో మాట్లాడటం వల్లనే.. తనపై ఉన్న గౌరవంతో ఆయన రాయలసీమ ఎత్తిపోతల పనులను తక్షణమే నిలిపివేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు.
ఈ విషయాన్ని తాను ఇప్పటిదాకా ఎక్కడా చెప్పుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపితేనే చర్చలకు వస్తామని తేల్చిచెప్పడంతోనే పనులు ఆగిపోయాయని స్పష్టం చేశారు. దీనిపై కావాలంటే బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలతో నిజనిర్ధారణ కమిటీ వేసి అక్కడికి వెళ్లి పరిశీలించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం సవాల్ విసిరారు.
సభలో చర్చిద్దామంటే.. బెదిరిస్తారా?
నీళ్లపై అసెంబ్లీలో చర్చిద్దామంటే బెదిరిస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కృష్ణా జలాల మీద చర్చ చేద్దామని మేం అనలేదు. కేసీఆరే స్వయంగా ఈ అంశంపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. కృష్ణా జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతోందని, దీనిపై పోట్లాడాల్సింది ఉందని, రేపటి నుంచి కార్యాచరణ తీసుకోబోతున్నామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. బీఏసీ సమావేశంలో హరీశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అందుకే తాము చర్చకు సిద్ధమయ్యాం.
సభలో చర్చిద్దాం అంటే.. బయట ఉండి బట్టలు ఊడదీస్తాం.. తోలు తీస్తాం అని కేసీఆర్, హరీశ్ మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనం. తోలు తీసేవాళ్లు, బట్టలు ఊడదీసేవాళ్లు చర్చలో పాల్గొని ఉంటే ఎవరు ఎవరి బట్టలు ఊడదీస్తారో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవారు. సభకు రాకపోయినా, చర్చలో పాల్గొనకపోయినా సభానాయకుడిగ భవిష్యత్ తరాలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది” అని పేర్కొన్నారు.
మొదట జూరాల వద్దే డిజైన్..
పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని, అది ముమ్మాటికీ కాంగ్రెస్ మానస పుత్రిక అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్లు పాలమూరు ఎత్తిపోతలను జూరాల ప్రాజెక్టు నుంచి చేపట్టాలని సూచించారని వివరించారు.
‘‘జూరాల వద్ద వరద రోజుల్లో రోజుకు 2 టీఎంసీల చొప్పున కాకుండా, 2.8 టీఎంసీల చొప్పున 25 నుంచి 28 రోజుల్లో 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. 14 మంది రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కూడా దీనిని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించింది. జూరాల వద్ద నిర్మిస్తే 3 దశల్లో, 22 పంపులతో నీటిని ఎత్తిపోయవచ్చని, ఇందుకు కేవలం రూ. 32,200 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇది లాభదాయకమైన, శాస్త్రీయమైన డిజైన్ అని నిపుణులు తేల్చిచెప్పారు” అని పేర్కొన్నారు.
డిజైన్ మార్పు వెనుక కుట్ర..
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే జూరాల డిజైన్‌ను పక్కనపెట్టి, కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘‘2015 ఏప్రిల్ 28న సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు.
జూరాల సామర్థ్యం తక్కువని సాకులు చెప్పారు. జూరాల నుంచి అయితే 318 మీటర్ల ఎత్తు నుంచి లిఫ్ట్ చేయాల్సి ఉండేది. అదే శ్రీశైలం అయితే 240 మీటర్ల (పాతాళం) నుంచే ఎత్తిపోయాల్సి వస్తోంది. దీనివల్ల లిఫ్టుల సంఖ్య, విద్యుత్ ఖర్చు తడిసి మోపెడవుతుందని తెలిసినా కమీషన్ల కోసమే ఈ పని చేశారు. కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే స్థల మార్పిడి జరిగింది” అని ఆరోపించారు.
పంపుల ఖర్చు డబుల్.. రూ. 5 వేల కోట్లు స్వాహా
జూరాల వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే పంపులు, లిఫ్టుల ఖర్చు రూ. 5,185 కోట్లు అయ్యేదని, కానీ శ్రీశైలానికి మార్చడం వల్ల పంపుల సంఖ్య 22 నుంచి 37కు పెరిగిందని, తద్వారా ఖర్చు రూ. 10,335 కోట్లకు చేరిందని సీఎం లెక్కలతో సహా వివరించారు.
అంటే కేవలం పంపుల కొనుగోలులోనే సరాసరి 100 శాతం, అంటే రూ. 5,200 కోట్లు అదనంగా పెంచి జేబులో వేసుకున్నారని ఆరోపించారు. మొత్తం ప్రాజెక్టు అంచనాను రూ. 35,250 కోట్ల నుంచి ఏకంగా రూ. 85 వేల కోట్లకు పెంచారని, ఇంత ఖర్చు పెట్టినా రిజర్వాయర్ల సామర్థ్యం మాత్రం 70 టీఎంసీలకే పరిమితం చేశారని, ఇది ముమ్మాటికీ ప్రజాధనాన్ని కొల్లగొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలువలు లేవు.. భూసేకరణ లేదు..
వేల కోట్లు ఖర్చు పెట్టి పంపులు, మోటార్లు కొన్నారే తప్ప, పొలాలకు నీళ్లిచ్చే కాలువలకు, డిస్ట్రిబ్యూటరీలకు నిధులు కేటాయించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 12.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలంటే భూసేకరణ జరగాలని, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఉండాలని, కానీ బడ్జెట్ లో వీటికి నామమాత్రపు నిధులే చూపించారని అన్నారు.
ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కే 7 వేల కోట్లు ఖర్చు చేసినా, పొలాలకు నీళ్లు పారించే నాథుడే లేడని, కాలువల నిర్మాణం జరగకపోతే ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. కేవలం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే ఈ ప్రాజెక్టును వాడుకున్నారన్నారు.
అప్పుల కుప్పగా ప్రాజెక్టు.. అధిక వడ్డీల భారం
పాలమూరు ప్రాజెక్టును రాష్ట్ర నిధులతోనే కడతామని, కేంద్రం సాయం అక్కర్లేదని 2015లో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని, ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వలేదని కేంద్రంపై నెపం నెట్టడం విడ్డూరంగా ఉందని సీఎం అన్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు రాసిన లేఖను ఆయన సభలో ప్రదర్శించారు.
ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , ఆర్ఈసీ నుంచి ఏకంగా 11.90 శాతం అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, కిడ్నీలు అమ్ముకునేవాడు కూడా ఇంత వడ్డీకి అప్పు తేడని అన్నారు. తాము ఢిల్లీ వెళ్లి వడ్డీ రేటును 7.25 శాతానికి తగ్గించి, వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని తెలిపారు.
కోర్టుల్లో అబద్ధాలు..
పర్యావరణ అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో పనులు చేస్తున్నారని ఎన్జీటీ లో కేసు వేస్తే, తప్పించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలు బయటపెట్టారు. 2017లో ఎన్జీటీకి, 2021లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో "పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం తాగునీటి కోసమే , సాగునీటికి ఇందులో ప్రొవిజన్ లేదు" అని రాతపూర్వకంగా ఇచ్చారని వెల్లడించారు.
12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రజలకు చెప్పి, కోర్టులో మాత్రం సాగునీరు కాదని చెప్పడం ముమ్మాటికీ మోసమేనని అన్నారు. ఈ అబద్ధాల వల్లనే సుప్రీంకోర్టు 2023లో కేవలం 7.15 టీఎంసీల తాగునీటి వినియోగానికి మాత్రమే అనుమతి ఇచ్చిందని, సాగునీటి పనులకు అడ్డంకులు ఏర్పడ్డాయని వివరించారు.
జానారెడ్డిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి
గడిచిన రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, సభకు వచ్చి తన అనుభవాన్ని పంచాలని తాను పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నానని సీఎం తెలిపారు. గతంలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి, రెండవ ప్రతిపక్ష నాయకుడిగా భట్టి విక్రమార్క పోషించిన పాత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైక్ ఇవ్వకపోయినా, కనీసం నిల్చోవడానికి అవకాశం ఇవ్వకపోయినా, ఎన్ని అవమానాలు ఎదురైనా వారు ఓపికతో, సంయమనంతో సభలో ఉన్నారని గుర్తు చేశారు. అవమానాన్ని దిగమింగుకొని, కొన్నిసార్లు భట్టి కంటతడి పెట్టిన సందర్భాలు ఉన్నా, పంటి బిగువన బాధను భరించి ప్రజా సమస్యలపై పోరాడారన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర..
రాష్ట్ర విభజన ఖరారైన తర్వాత నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేయడానికి కుట్ర పన్నారని, ప్రాజెక్టుల వివరాలు సేకరించి తప్పుడు లెక్కలు రాయించారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇరిగేషన్ ఈఎన్సీ సి.మురళీధర్ రావు 2014 జనవరి 2న ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు రాసిన లేఖను సీఎం సభలో బయటపెట్టారు.
ఆ లేఖ ప్రకారం కృష్ణా జలాల్లోని మొత్తం 811 టీఎంసీలలో రాయలసీమకు 144.70, కోస్తా ఆంధ్రాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు మాత్రమే కేటాయించారని తెలిపారు. మురళీధర్ రావు సాక్షాత్తు కేసీఆర్ కు సమీప బంధువని, పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనే కీలక బాధ్యతల్లో ఉన్నారని గుర్తు చేశారు.
కేసీఆర్ సంతకం.. తెలంగాణకు మరణ శాసనం
కిరణ్ కుమార్ రెడ్డి కుట్రపూరితంగా తయారు చేసిన పత్రం ఆధారంగా 2015 జూన్‌లో జరిగిన కేంద్ర జలవనరుల శాఖ సమావేశంలో తెలంగాణ అధికారులు సంతకం చేసి వచ్చారని సీఎం తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల మీద కేసీఆర్ రాసిన మరణ శాసనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనకు న్యాయంగా రావాల్సిన 490 టీఎంసీల కోసం కొట్లాడాల్సింది పోయి, హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.2016 జూన్ లో జరిగిన మరో సమావేశంలోనూ గత ఏడాది ఒప్పందాన్నే కొనసాగిస్తామని మళ్లీ సంతకం పెట్టారని, ఆ తర్వాత ప్రతిసారీ ఇదే తంతు కొనసాగిందని పేర్కొన్నారు.
తోలు తీస్తా అంటే.. నాలుక కోస్తం
కృష్ణా జలాలపై చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్, హరీశ్‌ను హుందాగా ఆహ్వానించాం. కానీ సభ పెడితే ‘కాంగ్రెస్ వాళ్ల బట్టలు ఊడదీస్తాం.. తోలు తీస్తాం’ అంటూ కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడారు.
ఒకవేళ కేసీఆర్ గనుక సభకు వచ్చి చర్చలో పాల్గొని ఉంటే.. వాస్తవాలు మాట్లాడితే ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు? ఎవరి తోలు ఎవరు తీస్తారనేది ప్రజలందరికీ తెలిసేది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తం. నేను ఒక్కటే చెప్తున్నా.. దేవుడి మీద ఆన.. సీఎం కుర్చీలో ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగనివ్వ. - అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
తప్పులు సరిదిద్దుతాం.. హక్కులు సాధిస్తాం
గత పదేళ్లలో కేసీఆర్ చేసిన తప్పుల వల్ల, పాపాల వల్ల కృష్ణా బేసిన్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ తప్పులను సరిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడ్డారని, నీటి వాటాలను తాకట్టు పెట్టారని, ఇప్పుడు సభకు రాకుండా పారిపోతున్నారని విమర్శించారు.
భవిష్యత్ తరాలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వాస్తవాలన్నింటినీ సభ ముందు ఉంచానని, న్యాయపరంగా, రాజకీయంగా పోరాడి తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను సాధిస్తామని, ఇందుకు ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని కోరారు.
పాలమూరు కాదు.. కమీషన్ల ఊరు
పాలమూరును కమీషన్ల ఊరుగా మార్చారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘‘గోదావరిపై ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం (మేడిగడ్డ)కు ఎలా మార్చారో, ఇక్కడ కూడా అదే ఫార్ములా అమలు చేశారు. నేరగాడికి నేరం చేయడానికి ఒక ప్యాటర్న్ ఉన్నట్లుగానే, కేసీఆర్ కు ప్రాజెక్టుల దోపిడికి ఒక ప్యాటర్న్ ఉంది.
అక్కడ తుమ్మిడిహట్టి బదులు మేడిగడ్డ.. ఇక్కడ జూరాల బదులు శ్రీశైలం. అక్కడ మూడు పంపులు కాస్తా ఐదు అయ్యాయి. ఇక్కడ కూడా లిఫ్టులు, పంపులు పెంచి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. అంచనాలు పెంచి దోచుకోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. ప్రజల అవసరాలు వీరికి పట్టవు’’అని సీఎం మండిపడ్డారు.
