
- మా మంత్రులనూ తెస్త..
- పబ్బులు, క్లబ్బులకు రమ్మంటే రాను.. దానికి నేను వ్యతిరేకం
- పాలమూరు ప్రాజెక్టును ఒక టీఎంసీకి కుదించింది నువ్వు కాదా?
- ప్రాణహితకు అంబేద్కర్ పేరును కాకా వెంకటస్వామి సూచిస్తే..
- నువ్వు కాళేశ్వరమని ఎందుకు పెట్టినవ్?
- నీళ్లు తరలించుకుపోవాలని ఏ హక్కుతో ఏపీకి చెప్పినవ్?
- వాటిపై చర్చిద్దామంటే అసెంబ్లీకి ఎందుకు వస్తలేవ్?
- ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం కన్నా నీ టైమ్‌లోనే వెయ్యి రెట్లు ఎక్కువ నష్టం
- ఆ నష్టానికి నీకు కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనని ఆగ్రహం
- తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి జలాలపై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చట్టపరిధిలో సభ నిర్వహించేందుకు తాను సిద్ధమని, ఒక్క నిమిషం కూడా తాను బయటకు పోనని, మంచి వాతావరణంలో సభ నిర్వహిద్దామని చెప్పారు. అవసరమైతే ఎక్స్‌పర్ట్స్‌నూ సభకు తీసుకొచ్చి చర్చిద్దామన్నారు.
‘‘కేసీఆర్ ఏదో ఒక తేదీ చెప్పి.. స్పీకర్‌కు లేఖ రాస్తే సభ నిర్వహించేందుకు సిద్ధం. లేదూ.. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చ పెడ్దాం. మా మంత్రుల బృందాన్ని పంపిస్త. ఫామ్‌హౌస్‌లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. కాదు..కూడదు.. సీఎం కూడా రావాలంటే.. అక్కడికి నేనూ వస్త. మాకు ఎలాంటి భేషజాల్లేవు” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఏపీ కృష్ణా నీళ్ల దోపిడీపై బుధవారం ప్రజాభవన్‌లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సమగ్రంగా చర్చిద్దామన్నారు. నీళ్లతో పాటు ఏ విషయంలోనైనా తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుందంటే.. దేవుడే ఎదురొచ్చి నిలబడినా వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు ఎంత వరకైనా వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
పాలమూరును ఒక టీఎంసీకి కుదించిండు
‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును 2 టీఎంసీలతో నిర్మించేందుకు తలపెడితే.. కేసీఆర్ మూడు టీఎంసీలు చేస్తారకున్న. కానీ, ఉన్నదాన్ని కూడా ఒక్క టీఎంసీకి కుదించిండు” అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అంచనాలను అడ్డగోలుగా పెంచి.. ఎత్తుకునే నీళ్లను మాత్రం తగ్గించారని సీఎం అన్నారు. డిండికి అర టీఎంసీని ఎక్కడి నుంచి తేవాలో తెలి యని గందరోగళంలోకి నెట్టారని సీఎం మండిపడ్డారు.
‘‘ఏపీ శ్రీశైలం కింద 4 టీఎంసీల సామర్థ్యాన్ని 9.6 టీఎంసీలకు పెంచుకుంటే.. కేసీఆర్ మాత్రం పాలమూరును 2 టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించిండు. నాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటివాళ్లు కొట్లాడి సాధించుకున్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉమ్మడి ఏపీలోనే 34 కిలోమీటర్ల టన్నెల్‌ను తవ్వారు. కేసీఆర్ హయాంలో ఏడాదికి ఒక కిలోమీటర్ చొప్పున తవ్వినా.. మిగతా పది కిలోమీటర్లు పూర్తయ్యేది. ఆనాడు రూ.వెయ్యి కోట్లతో పూర్తిచేయాల్సిన ప్రాజెక్టును.. కేసీఆర్ రూ.3 వేల కోట్లకు పెంచి పడావు పెట్టిండు. కల్వకుర్తికి నీటి కేటాయింపులు చేయలేదు.. పూర్తి చేయలేదు. నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులనూ పూర్తి చేయలేదు. దీంతో నీటి హక్కులూ రాలేదు. ప్రయోజనాలు కలగలేదు.
ఆ తప్పును మేం సరిదిద్దుదామని ప్రయత్ని స్తుంటే.. మాపై వాళ్లు బురదజల్లుతున్నరు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పాలకులు చేసిన నష్టంతో పోలిస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ హయాంలో చేసిన నష్ట మే వెయ్యి రెట్లు ఎక్కువ అని అన్నారు. కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనని ఆయన పేర్కొన్నారు.
2015, 2020లో కృష్ణా నదీ జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున నీటి వాటాలను కేసీఆర్ రాసిచ్చి వచ్చారని.. ఆ తర్వా త బేసిన్లు లేవ్, బేషజాల్లేవంటూ రాయలసీమకు కృష్ణా, గోదావరి జలాలనూ తరలించేందుకు అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎవరికి కడుపునొప్పైనా రాయలసీమను రతనాల సీమను చేస్తానంటూ.. జగన్‌ను ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి, జీవోలిచ్చి, టెండర్లు ఇచ్చి అన్ని రకాలుగా కేసీఆర్ సహకరించిండు. వాళ్లిద్దరి మధ్య అనుబంధం.. తెలంగాణకు తీరని నష్టం. కానీ, ఆ అనుబంధంతో తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాసే హక్కు కేసీఆర్కు లేదు. ఉమ్మడి కోటా హక్కు నుంచి హైదరాబాద్‌కు తాగునీటి కోటాను సెపరేట్ చేసి.. పరివాహక ప్రాంతం ఆధారంగా కోటాలు తీసుకుందామన్న చర్చ తెచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ, ఆ చర్చ లేదు.
నేను సమస్యను ఒక్క కోణం నుంచే కాదు.. రెండో కోణం నుంచి కూడా చూస్తున్న. ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి జూరాల సోర్సుగా ఉమ్మడి ఏపీలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీవో ఇచ్చిండు. కానీ, కేసీఆర్ హయాంలో సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో నష్టం జరిగింది. కృష్ణా, తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలోకి ఎంటరవుతాయి. ఎంటరవగానే నీళ్లను ఒడిసిపట్టి ఉంటే బాగుండేది. అప్పుడు మనం వదిలిన తర్వాతే ఏపీ వాళ్లు నీళ్లు తీసుకోవాల్సి వచ్చేది.
కానీ, సోర్సును శ్రీశైలానికి మార్చడం ద్వారా ఏపీనే తొలుత నీటి దోపిడీకి తెరలేపేందుకు అవకాశం ఇచ్చింది కేసీఆరే” అని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే ఒడిసిపట్టి ఉంటే.. ఏపీ నిర్మించిన పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాలకు మనం వాడుకున్నాకే నీళ్లుండేవని అన్నారు. ‘‘జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని చిన్నారెడ్డి చెబితే.. నువ్వు చదువుకున్నవా అంటూ అసెంబ్లీలోనే కేసీఆర్ అవమానించిండు. అవినీతితో కూడిన ఆలోచనలతో కేసీఆర్ చేసిన నిర్ణయాలు.. కృష్ణా పరివాహక రైతులు, ప్రజలకు మరణశాసనంగా మారినయ్. వాస్తవానికి ఏపీకి ఇచ్చిన 512 టీఎంసీల నీటిని ఆ రాష్ట్రం వాడుకోవాల్సి వస్తే.. ఎక్కువ ఆయకట్టు కృష్ణా డెల్టాలోనే ఉంది.
అంటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల దాటుకుని వెళ్లాక ఉండే ఆయకట్టుకు నీళ్లు వెళ్లేవి. ఇలా నీటిని డెల్టాకు తీసుకెళ్తే.. మన దగ్గర భూగర్భజలాలు పెరిగి ఉండేవి. ఎంతో కొంత నీళ్లూ తీసుకొనే అవకాశం ఉండేది. విద్యుదుత్పత్తి జరిగి చారాణాకో.. ఆటాణాకో విద్యుత్‌ను తక్కువ ఖర్చుకు కొనేందుకు ఆస్కారం ఉండేది. కానీ, ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అటు నుంచి అటే ఔట్‌సైడ్ బేసిన్ అయిన రాయలసీమకు పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి తీసుకెళ్లడం వల్ల.. శ్రీశైలం, సాగర్, పులిచింతల పవర్ ప్రాజెక్టులు పనిచేయకుండా పోతాయి. మనం కేవలం నీళ్లు లేక వ్యవసాయానికి జరిగే నష్టం గురించే ఆలోచిస్తున్నాం. కానీ, చారాణాకు ఆటాణాకు దొరికే విద్యుత్‌ను మనం నష్టపోతున్నం. 10 రూపాయలతో యూనిట్ విద్యుత్‌ను కొనాల్సి వస్తున్నది. ఒక్కోసారి ఆ ధరకూ విద్యుత్ దొరకని పరిస్థితి వస్తుంది. ఈ నష్టమూ కేసీఆర్ వల్లే వచ్చింది’’ అని ఆయన వివరించారు.
కమీషన్లు రావనే వాటిని పట్టించుకోలే..
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం 54 లక్షల ఎకరా లకు నీళ్లిస్తే.. ఎకరాకు పెట్టిన ఖర్చు 93 వేలని.. కేసీఆర్ హయాంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి ఎకరాకు రూ.11.50 లక్షలు ఖర్చు చేశారని సీఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 11 ఏఐబీపీ ప్రాజెక్టులున్నాయంటూ సీఆర్ పాటిల్ లిస్టు చేతిలో పెట్టారని, దీనిపై తలదించుకోవాల్సిన పరిస్థితి అని ఆయన అన్నారు. వాటిపై ఫోకస్ పెడితే కమీషన్లు రావనే నాడు వాటిని కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు.
మీ వీధి బాగోతాలేంది?
‘‘కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి.. ప్రజా జీవితంలో ఉండాలి అని నేను అంటుంటే.. ఆయన కొడుకొచ్చి మాత్రం కేసీఆర్ దేనికీ పనికిరాడు అంటున్నడు” అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘నేపాల్‌లో కూడా ఇట్లనే జరిగింది. రాజ్యం బాగాలేదని ఇంటోళ్లను డిన్నర్‌కు పిలిచి ఏకే 47తో కుటుంబం మొత్తాన్ని చంపేసిండు. ఆ తర్వాతే అతడే నేపాల్‌కు రాజు అయ్యిండు. మీ ఇంట్లో గొడవలుంటే మేమేం చేస్తం. తమ్ముడితోనో.. బావతోనో గొడవలుంటే కుల పెద్దల ముందు తేల్చుకోవాలి. కానీ, ఈ వీధి బాగోతాలేంది? ఒక దిక్కు ఆయన.. ఒక దిక్కు ఆయన బావ.. ఇంకో దిక్కు ఆయన చెల్లె. ఈయన గల్లీలో ఉంటే.. చెల్లేమో ఢిల్లీలో. ఈ వీధి బాగోతాలు మంచిది కాదు” అని కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని హితవుపలికారు.
వరద జలాలపై బోర్డు ముందే తేల్చుకుందాం
వరద జలాలు, మిగులు జలాలను రంగారెడ్డికి తీసుకెళ్తే నష్టమేంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘ప్రోరేటా ప్రకారం వరద జలాల్లో లెక్క తేలాక పైన మేం కట్టుకుంటాం. కింద మీరు(ఏపీ) కట్టుకోండి. లెక్క తేలితే బురద ఉందా.. వరద ఉందో తేలుతుంది కదా. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది కాబట్టి వరద జలాలుంటాయని ఏపీ సీఎం అనుకుని ఉండొచ్చు. సరే గోదావరి రివర్ బోర్డు ముందే మీరేం కట్టాలనుకుంటున్నరు.. మేమేం కట్టాలనుకుంటున్నామో చర్చిద్దాం. మీకు పతార ఉందని పైకి వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామంటే ఎట్ల? మోదీ మేం చెప్పింది వింటాడని పైనుంచి కిందకు వస్తరా? న్యాయపరంగానే బనకచర్లపై పోరాడుతున్నం. మేం అందరి దగ్గరికీ వెళ్తున్నాం. వ్యూహం లేకుండానే ఇంత దూరం వచ్చామా?’’ అని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా వెళ్తామని ఆయన తేల్చిచెప్పారు.
జాతిపితనని చెప్పుకునే నువ్వు.. చేసిందేంది?
అంతర్జాతీయ జలహక్కుల ప్రకారం ఒక బేసిన్లో అవసరాలు తీరిన తర్వాతే ఇతర బేసిన్లకు తరలిం చాల్సి ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కానీ, ఏ హక్కుతో ఔట్‌సైడ్ బేసిన్‌కు నీళ్లు తరలిం చేందుకు బేసిన్లు లేవు.. బేషజాల్లేవు అని కేసీఆర్ అంటారని ఆయన ప్రశ్నించారు.‘‘గోదావరి దాటిం చి.. కృష్ణా దాటించి పెన్నాకు తీసుకుపొమ్మని ఏ హోదాలో చెప్పిండు? ఏపీకి పాలెగాడిలాగా కేసీఆర్ మారిండా? వీటిపై చర్చిద్దామంటే ఆయన అసెంబ్లీకి రాడు. కాంగ్రెస్ హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించే బ్యారేజీకి కాకా వెంకటస్వామి సలహాతో బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి అని పేరు పెట్టారు.
కానీ, దానికి కేసీఆర్.. కాళేశ్వరం అని పెట్టిండు.. అంచ నాలు పెంచిండు. 23, 24, 25, 26 ప్యాకేజీల్లో రంగారెడ్డి, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు లో రెండున్నర లక్షలు, నల్గొండ జిల్లాలో నాలుగున్న ర లక్షల ఎకరాల ఆయకట్టును కాళేశ్వరం నుంచి తీసేసిండు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోకి తరలిస్తే.. ట్రిబ్యునల్‌లో మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని కాళేశ్వరం నుంచి ఆ ఆయకట్టును తొలగించినట్లు సాకులు చెప్పిన్రు. కానీ.. కృష్ణా, గోదావరి నీళ్లను మాత్రం రాయలసీమ అవతలకు మళ్లించేందుకు బేసిన్లు లేవ్, బేషజాలు లేవ్ అని ఎట్ల చెప్తరు? తెలంగాణ జాతిపితనని చెప్పుకుంటూ.. వీటిని మాత్రం ప్రాజెక్టు నుంచి ఎందుకు తొలగించినవ్? దీనికి సమాధానం చెప్పు” అని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు.
పగటిపూట క్లబ్బులు, రాత్రిపూట పబ్బుల్లో చర్చ పెడదామని మీరు(బీఆర్ఎస్) ఉబలాటపడితే మేం రాలేం. ఈ క్లబ్బులు, పబ్బులంటేనే మాకు భయం. వాటికి మొదటి నుంచీ మేం దూరం. వ్యక్తిగతంగా నేను ఈ కల్చర్‌కు వ్యతిరేకం. డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నం. డ్రగ్స్, గంజాయి అమ్మేవారిని అణచేయడానికి చర్యలు తీసుకున్నం. కాబట్టి దయచేసి నన్ను ఈ క్లబ్బులు, పబ్బులకు పిలవొద్దు.
- సీఎం రేవంత్ రెడ్డి