విషయం తెలవగానే గుమ్మడి నర్సయ్యకు ఫోన్ : సీఎం రేవంత్​

విషయం తెలవగానే గుమ్మడి నర్సయ్యకు ఫోన్ : సీఎం రేవంత్​
  • ఆయన ఖమ్మం నుంచి రాగానే కలుస్తనన్నడు: సీఎం రేవంత్​

 హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తన ఇంటి వద్దకు రాలేదని, కొద్ది దూరంలో ఉండిపోయారని, ఎవరో వీడియో తీసి సోషల్​ మీడియాలో వైరల్​ చేశారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఆ విషయం తనకు సాయంత్రం తెలిసిన వెంటనే తన పేషీ నుంచి ఫోన్​ చేయించానని చెప్పారు. తర్వాతి రోజు రావాలని చెబితే.. అప్పటికే ఆయన ఖమ్మం వెళ్లిపోయానని చెప్పారన్నారు. మళ్లీ హైదరాబాద్​కు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారని వివరించారు. 

శనివారం అసెంబ్లీలో గుమ్మడి నర్సయ్య అపాయింట్​మెంట్​పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్​ బదులిచ్చారు. కాగా, ఇకపై ప్రజాప్రతినిధులను సెక్రటేరియెట్​లోనే కలుస్తానని సీఎం స్పష్టం చేశారు. వారంలో 4 రోజులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు రావొచ్చని చెప్పారు. అయితే, ఓ 24 గంటల ముందే అపాయింట్​మెంట్​ తీసుకుంటే బాగుంటుందని, తద్వారా ఎంతమందిని కలిసేందుకు అవకాశం ఉంటుందనే దానిపై అంచనాకు రావొచ్చని పేర్కొన్నారు. 

ప్రస్తుతం తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలుసహా నేతలు అర్ధరాత్రి వరకు తనను కలిసేందుకు ఇంటికి వస్తున్నారని, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నదని చెప్పారు. కొన్ని ముఖ్యమైన మీటింగ్స్​లో ఉన్నప్పుడూ వస్తుండడంతో కలవలేకపోతున్నానని తెలిపారు. ఎమ్మెల్యేలకూ వారి వారి నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు కామన్​ అని, రాష్ట్రస్థాయిలో తనకు ఆ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయని, కాబట్టి అర్థం చేసుకోవాలని కోరారు. మిమ్మల్ని పొద్దుపొద్దున్నే 5 గంటలకు వచ్చి లేపి రమ్మంటే మీకు ఎలా ఇబ్బందిగా ఉంటుందో.. తనకూ అలాగే ఉంటుందని తెలిపారు.