- అదానీ, అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర
- కేంద్ర సర్కార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూరా నిరసనలు.. గ్రామ సభల్లో తీర్మానాలు
- ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభలు
- ములుగు సభకు సోనియా, రాహుల్‌కు ఆహ్వానం
- మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి
- అందరూ సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం
- పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం ప్రసంగం
- ఉపాధి హామీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం: డిప్యూటి సీఎం భట్టి
- పథకం గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టర్ల పంపిణీ: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ల కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వాళ్లకు తక్కువ వేతనాలకే కూలీలను పంపించడానికి ఉపాధి హామీ పథకంలో కేంద్రం మార్పులు చేస్తున్నదని.. దీని వెనుక ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీల కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని ఆయన విమర్శించారు. ‘‘140 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో 80 శాతం మంది ఉపాధి హామీ పథకంలో సభ్యులే. కానీ తమకు చట్ట సభల్లో బలం ఉందనే కారణంతో మోదీ ప్రభుత్వం పేదలను ఇబ్బందులపాలు చేస్తోంది. మహత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి మహనీయులు వెట్టిచాకిరీని నిర్మూలించి, ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించేందుకు తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసింది. 400 ఎంపీ సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు” అని అన్నారు.
‘ఉపాధి’ని పునరుద్ధరించేదాకా పోరాటం..
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో పేదలు, రైతుకూలీల ఆత్మగౌరవం పెరిగిందని.. ఈ పథకం ప్రారంభానికి, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘గతంలో రైతు వ్యతిరేక చట్టాలను ప్రధాని మోదీ తీసుకువస్తే..వాటికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కొట్లాడారు. ఆ సమయంలో దేశ రైతులకు మోదీ క్షమాపణలు చెప్పి, ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడంలో రాహుల్ విజయం సాధించారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పేరులోనే గందరగోళం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. ఈ విషయంలో దేశ ప్రజలకు మోదీతో క్షమాపణలు చెప్పిస్తాం” అని గుర్తుచేశారు.
20 నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు..
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే కేంద్రం కుట్రలకు నిరసనగా ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూరా గ్రామ సభలు ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పార్టీ నేతలను సీఎం రేవంత్ కోరారు. ‘‘అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలి. ప్రతి మండలానికి ఒక ఇన్‌చార్జిని నియమించండి. నేను కూడా ఒక మండలం బాధ్యతలు తీసుకుంటాను. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు తెలంగాణలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ సభలు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి సభ ఈ నెల 3న మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుంది. ములుగులో ఏర్పాటు చేసే సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ను ఆహ్వానిస్తాం’’ తెలిపారు. ‘‘సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతం సీట్లను గెలుచుకున్నాం. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్లా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. పార్టీ కార్యకర్తల కష్టం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కార్యకర్తల గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలి. కాంగ్రెస్ వల్లనే నేను సీఎం అయ్యాను. ఇప్పుడు దేశం ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి” అని పిలుపునిచ్చారు.
సామ్రాజ్యవాదుల కన్నా బీజేపీ నేతలు ప్రమాదకరం: డిప్యూటీ సీఎం భట్టి
సామ్రాజ్యవాదుల కన్నా బీజేపీ నేతలు ప్రమాదకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం దేశంలో ఎన్నో సామాజిక, ఆర్థిక మార్పులకు కారణమైంది. బీజేపీ ప్రభుత్వం ఒక్క కొత్త చట్టం తీసుకురాకపోగా, కాంగ్రెస్ తెచ్చిన చట్టాలన్నింటిని రద్దు చేసే కార్యక్రమం చేపట్టింది. మోదీ సర్కార్ తెచ్చిన కొత్త ఉపాధి చట్టం రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం” అని పిలుపునిచ్చారు.
డీసీసీ చీఫ్‌ల తీరుపై మీనాక్షి అసంతృప్తి..
ఉపాధి హామీ పథకంపై మోదీ సర్కార్ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేపట్టనున్న నిరసనలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కాగా, డీసీసీ అధ్యక్షుల తీరుపై మీనాక్షి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 8లోపు డీసీసీ కార్యవర్గాలను పూర్తి చేయాలన్నారు.
పోస్టర్ల పంపిణీ: మహేశ్ గౌడ్
ఉపాధి హామీ పథకం గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వేల చొప్పున పోస్టర్లను పంపిణీ చేయనున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. ఇవి గ్రామ గ్రామాన, వాడవాడకు, ఇంటింటికి చేరాలని పిలుపునిచ్చారు. ‘‘జిల్లా కాంగ్రెస్ కమిటీలు ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి, కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను విజయవంతం చేయాలి” అని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రపతికి తీర్మానాలు పంపిద్దాం: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలోని 12 వేల పంచాయతీల్లో కొత్త ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకంగా తీర్మానం చేయించి, వాటిని రాష్ట్రపతికి పంపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టి గ్రామ స్థాయిలో మోదీ సర్కార్ నిజస్వరూపాన్ని వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
