
- పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు వివేక్, పొన్నంతో భేటీ
- టికెట్ కోసం నలుగురి పేర్లు పంపాలని సూచన
- జెడ్పీటీసీ టికెట్ల ఖరారుపై ఈ నెల 6న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమదేనని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బైపోల్ ఇన్చార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌తో ఆయన సమావేశమయ్యారు. మరో ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అందుబాటులో లేని కారణంగా భేటీకి హాజరు కాలేదు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను, తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను జనంలో ఎండగట్టాలన్నారు. అన్నివర్గాల వారిని కలుపుకొనిపోవాలని.. ఎక్కడ కూడా నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయలేమి కనిపించవద్దని సూచించారు. బస్తీల్లో చిన్న, చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి.. జనానికి ప్రజా పాలన ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాలని ఆయన చెప్పారు. అన్ని వర్గాల వారికి సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నామని, వాటిని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. మైనార్టీల మద్దతు కూడగట్టడంలో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
నాలుగు పేర్లతో నివేదిక
జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం హైకమాండ్ కు పంపించేందుకు నలుగురు ఆశావహుల పేర్లతో తనకు ఓ నివేదిక అందించాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నాలుగు పేర్లలో ఒక పేరును హైకమాండ్ ఖరారు చేస్తుందని చెప్పారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ఇప్పుడు వారిలోంచి పీసీసీ నాయకత్వం, ఇన్చార్జ్ మంత్రులు నాలుగు పేర్లను మాత్రమే సీఎంకు పంపించాల్సి ఉంటుంది.
ఈ జాబితాపైనా తాజా సమావేశంలో సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు చర్చించారు. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నవీన్ యాదవ్ పేరుతో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియార్టీ, సిన్సియార్టీ, సామాజిక సమీకరణాలు, ప్రజల్లో పలుకుబడి ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. ప్రతి జెడ్పీటీసీ స్థానం కోసం
మూడేసి చొప్పున పేర్లు!
ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని జెడ్పీలు కాంగ్రెస్ఖాతాలో పడేలా కార్యాచరణ సిద్ధం చేయాలని, ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి మూడేసి పేర్లను ఈ నెల 5 లోపు పీసీసీకి పంపించాలని మరోసారి సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసేందకు ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని తాజా భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత జిల్లా నాయకత్వాలదేనని స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ పరిష్కారం కాని పక్షంలో పీసీసీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లను కాంగ్రెస్ గెలుచుకునేలా డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించినట్లు తెలిసింది.