- బీజేపీలో ఉంటూ కేటీఆర్ చెప్పినట్టు వింటున్నారని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నరు
- కిషన్ రెడ్డి మా కాళ్లల్లో కట్టెలు పెట్టడం ఆపాలి
- తెలంగాణకు నిధులు, మెట్రో, ట్రిపుల్ ఆర్ అనుమతులు తీసుకురావాలి
- 100 రోజుల్లో ‘మూసీ’ ఫేజ్–2 పనులు.. హడ్సన్ రివర్ ఫ్రంట్‌లా మారుస్తం
- ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా నిధులిస్తం.. ఈ రెండేండ్లూ కేవలం అభివృద్ధికే ప్రాధాన్యమని వెల్లడి
- ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో పలు అభివృద్ధి పనులకు
- సీఎం శంకుస్థాపన..క్యూర్ వన్ యాప్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత–-చేవెళ్ల (తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టుకు మహారాష్ట్ర సీఎం అనుమతులు ఇవ్వకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నట్టు తమకు సమాచారం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో ఉంటూ కేటీఆర్ చెప్పినట్టు ఆయన వింటున్నట్టు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫేజ్–-2 కింద నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రాబోయే 100 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళనతోపాటు ఎలివేటెడ్ కారిడార్లు, వనస్థలిపురం నుంచి వరంగల్ రోడ్డు వరకు కనెక్టివిటీ పెంచి ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తామన్నారు. ఇప్పటికే మూసీ ఫేజ్–-1 కింద గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆదివారం ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో రూ. 1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
‘‘గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ నిర్మిస్తాం. న్యూయార్క్-–న్యూజెర్సీ మధ్య ఉన్న హడ్సన్ రివర్ ఫ్రంట్‌లా దీన్ని మారుస్తం. మూసీ ఒడ్డున ఉన్న పేదలకు ఇండ్లు పోతే ఇండ్లిస్తం.. ఉపాధి కల్పిస్తం.. వాళ్ల పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తం” అని భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ నాయకులతో కిషన్‌రెడ్డి చేతులు కలిపారు..
తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘‘గతంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్న మన మెట్రో.. ఇవాళ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నగర ప్రయాణికుల కోసం నాగోల్ జంక్షన్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ వరకు.. అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ అవతలికి 122 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణకు ప్రతిపాదనలు పంపితే కిషన్‌రెడ్డి కాళ్లల్లో కట్టెలు పెట్టి ఆపించారు.
హైదరాబాద్‌ను సింగపూర్, టోక్యో, న్యూయార్క్‌తో పోటీ పడేలా చేసే 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) కోసం నేను 50 సార్లు ఢిల్లీకి వెళ్లా.. 5 సార్లు మోడీని కలిశా.. మరి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు ఆపుతున్నారు? ఈ నగర ప్రజలు మీకు ఓట్లు వేయలేదా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది” అని నిలదీశారు. కిషన్‌రెడ్డి చీకట్లో బీఆర్ఎస్ నాయకులతో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘అభివృద్ధి కోసం ఢిల్లీకి వస్తానంటే నన్ను తీసుకెళ్లవు.
ఇప్పటికైనా ఉపన్యాసాలు, కాళ్లల్లో కట్టెలు పెట్టడం ఆపి.. తెలంగాణకు నిధులు, మెట్రో, ట్రిపుల్ ఆర్ అనుమతులు తీసుకురా.. నిన్ను ఎల్బీ స్టేడియంలో లక్ష మంది ముందు శాలువా కప్పి సన్మానిస్తం. లేదంటే 15వ తేదీ తర్వాత మా కార్యాచరణ వేరేలా ఉంటుంది.. బరాబర్ నీ సంగతి తేలుస్తాం’’ అని కిషన్‌రెడ్డిని హెచ్చరించారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానికంగా ఎమ్మెల్యేలుగా ఎవరున్నా సరే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిధులు, అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ‘‘ఇప్పుడు మనకు ఎలాంటి ఎన్నికలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలు రాజకీయం చేసుకుందాం.. కానీ ఈ రెండేండ్లు మాత్రం రాత్రి, పగలు కష్టపడి మన నగరాన్ని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసుకుందాం. నా దగ్గరికి ఏ ఎమ్మెల్యే వచ్చినా.. ఆయన అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే నూటికి నూరు శాతం అండగా ఉంటా. ప్రజలు వాళ్లను ఎమ్మెల్యేలుగా గెలిపించారు.. నన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు.
ప్రజా సమస్యలపై ఎవరు వచ్చినా స్పందించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత” అని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత బండారి రాజిరెడ్డి పేరు పెట్టినట్టు చెప్పారు. కాగా, 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 98 కోట్లతో నిర్మించనున్న మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) నూతన భవన నిర్మాణానికి , సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా రూ. 960 కోట్లతో ఏఓసీ సెంటర్ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద రూ. 416 కోట్లతో చేపట్టనున్న 6 లేన్ల భారీ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
వీటితోపాటు రూ. 37.50 కోట్లతో నిర్మించనున్న 100 పడకల మల్కాజ్‌గిరి జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ చేయడంతోపాటు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ‘క్యూర్ వన్’ (క్యూర్) మొబైల్ యాప్‌ను సీఎం ఆవిష్కరించారు.
