
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపితే ఊర్లు కొట్టుకపోతయ్
- మూడింటినీ ఒకే రకమైన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు
- మేడిగడ్డలోని లోపాలే మిగతా రెండు బ్యారేజీల్లో ఉండొచ్చని నిపుణులు చెప్తున్నరు
- కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి
- ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి
గోదావరిఖని, వెలుగు: గోదావరి నీటిని తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జంక్షన్లాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, వాటర్ లిఫ్టింగ్‌కు ఎల్లంపల్లి గుండెకాయ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘15 ఏండ్ల కింద కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిటారుగా నిలబడి ఉంటే బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుప్పకూలిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకే రకమైన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. మేడిగడ్డలోని లోపాలే మిగతా రెండు బ్యారేజీల్లో ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు చేపడతామని, అప్పటివరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని, ఒకవేళ నీటిని ఆ బ్యారేజీల్లో నిల్వ చేస్తే ఊర్లు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘కేసీఆర్ లాగా నేను 80 వేల పుస్తకాలు చదవలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్న మామ స్వాతిముత్యం అయితే.. అల్లుడు ఆణిముత్యం అని జనం అనుకుంటున్నారు” అని కేసీఆర్, హరీశ్‌రావుపై ఆయన మండిపడ్డారు. హరీశ్, కేటీఆర్ చెబితే నీళ్లను ఎత్తిపోయలేమని, టెక్నికల్ కమిటీ సూచన ప్రకారం ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బ్యారేజీని హెలికాప్టర్ నుంచి సీఎం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని గోదావరి నదికి చీరె, సారె, పూలు సమర్పించి పూజలు చేశారు.
ప్రాజెక్టుకు వస్తున్న వరద, ప్రస్తుతం ఉన్న నీటి నిలువ, దిగువకు వదులుతున్న నీటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని.. సాంకేతిక నైపుణ్యం, వైఫల్యంతో పాటు డిజైన్ నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలి
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. వరద పెరిగే అవకాశం ఉంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
హైదరాబాద్/మెదక్, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద నష్టంపై వెంటనే నివేదికలు తయారు చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్‌తో కలిసి హెలికాప్టర్‌లో తొలుత ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుని, అక్కడ వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం.. హెలీక్యాప్టర్లోనే పోచారం ప్రాజెక్టు, దాని పరీవాహంతో పాటు కామారెడ్డి జిల్లాలోని వరద ప్రాంతాలను పరిశీలించారు. ఆ జిల్లాలో జరిగిన నష్టం, తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది.
దాంతో అక్కడి నుంచి నేరుగా మెదక్ జిల్లాలో వరద ప్రాంతాలను సీఎం పరిశీలించారు. మెదక్ చేరుకున్న సీఎం.. ఎస్పీ ఆఫీస్‌లో ఎంపీ రఘునందన్ , కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రతను, తీసు కున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా బఫర్‌స్టాక్ మెయింటెన్చేస్తున్నామన్నారు. అంతకుముందు ఉదయం వర్షాలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు.