- వ్యవసాయాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి
- ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నరు: సీఎం రేవంత్
- ప్రగతిని ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ అడ్డగోలు రాజకీయాలు
- కేంద్రంలో మోదీ ఉన్నారని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు
- వడ్లు తీసుకోకపోతే జూన్ 15 తర్వాత కిషన్‌రెడ్డి సంగతి చెప్తామని కామెంట్
- కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ మార్కెట్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి ని చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్‌ఎస్ అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేండ్లపాటు అధికారంలో ఉండి వ్యవసాయాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘కోహెడ మార్కెట్ కట్టనివ్వం.. భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం.. రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), వరంగల్–-ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు వద్దు” అంటూ ప్రతిపక్షం ప్రగతి నిరోధకంగా మారిందని మండిపడ్డారు. ఇట్లే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, చివరకు కారు ఎక్కేందుకు కాదు కదా.. టైర్లు లేని అంబాసిడర్ కారులా ఫార్మ్‌హౌస్‌కే పరిమితం కాక తప్పదని ఎద్దేవా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.2,400 కోట్ల భారీ వ్యయంతో 240 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ మార్కెట్‌కు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమాషాలు చేస్తున్నారని, తాము ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో పదవుల్లోకి రాలేదని అన్నారు. ‘‘గుండు, అరగుండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
మోదీ ప్రభుత్వం మా వడ్లు కొనకపోతే చూస్తూ ఊరుకోం. కిషన్ రెడ్డి.. జూన్ 15 తర్వాత 75 లక్షల టన్నుల వడ్ల సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత నీ సంగతి చెప్తా’’ అని హెచ్చరించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మక్క, జొన్నలు, పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా కొనిపిస్తామని, లేదంటే కిషన్ రెడ్డిని పొలిమేరలు దాటిస్తామని అన్నారు. కేంద్రంలో మోదీ ఉన్నారని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, మర్యాదగా ఉంటేనే మర్యాద దక్కుతుందని హెచ్చరించారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను సమస్యలను చూసి పారిపోయేవాడిని కాదని..ప్రజలు ఇచ్చిన గుండె ధైర్యంతో ఫార్మ్‌హౌస్‌లో పడుకున్న కేడీ (కేసీఆర్) తోనైనా, ఢిల్లీలో ఉండే మోదీతోనైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎవరి మెడలైనా వంచుతానని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పుణ్యమా అని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని, సంచి నిండా పైసలు తీసుకెళ్తే జేబులో కూరగాయలు వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. త్వరలోనే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసి పాలమూరు–-రంగారెడ్డికి జాతీయ హోదా, మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ నిధులను సాధించుకుంటామన్నారు.
గ్రీన్ చానల్ ద్వారా రూ. 2,400 కోట్లు ఇచ్చే పూచీ నాదే..
గతంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలించినప్పుడు కనీస వసతులు లేక, రేకుల షెడ్లు కూలి రైతులు, వ్యాపారులు కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. నాడే పార్లమెంట్ సభ్యుడిగా తాను అక్కడికి వచ్చి ధైర్యం చెప్పానని, మన ప్రభుత్వం రాగానే అంతర్జాతీయ మార్కెట్ కడతామని ఇచ్చిన మాటను ఇవాళ నిలబెట్టుకున్నానని ప్రకటించారు. ఈ మార్కెట్‌లో కేవలం పండ్లే కాకుండా కూరగాయలు, పూలు, పౌల్ట్రీ, ఫిష్, మటన్‌లాంటి అన్ని రకాల సదుపాయాలు ఒకేచోట లభిస్తాయన్నారు.
రాబోయే 6 నెలల్లో రాత్రింబవళ్లు పనులు పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించాలని వేదికపై ఉన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబును ఆదేశించారు. ‘‘పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తానని.. కుర్చీ వేసుకుని కూర్చుంటా అని కేసీఆర్ అన్నాడు.. కానీ ఎన్నికలు కాగానే మందేసి ఫార్మ్‌హౌస్‌లో పడుకున్నాడు. ఆయనలా కాకుండా మన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఇక్కడే ఉండి డిసెంబర్ కల్లా మార్కెట్ పనులు ప్రారంభమయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలి” అని అన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా రూ. 2,400 కోట్లు గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేసే పూచీ తనదేనని స్పష్టం చేశారు.
ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా రూ. 15 వేల నుంచి 16 వేల కోట్ల ఆదాయం వస్తున్నా, ఆఫీసుల్లో కనీసం కూర్చోవడానికి కుర్చీ, తాగడానికి నీళ్లు, బాత్‌రూమ్ లు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కస్టమర్ తమ దేవుడు’ అని నమ్మే ప్రభుత్వం తమదన్నారు. అందుకే ఓఆర్ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 12 క్లస్టర్లుగా విభజించి, ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో ఏసీ వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల డిజైన్లను నేడు ప్రారంభించినట్టు వెల్లడించారు. ప్రతిపక్షాలు మూసీ నదిలో పడి దొర్లినా సరే.. తాము మాత్రం రేడియల్ రోడ్లు, ట్రిపుల్ ఆర్, భారత్ ఫ్యూచర్ సిటీల నిర్మాణాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు.
హరీశ్ నీ సలహాలు మాకొద్దు
గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో కలిపారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూడేండ్లుగా కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా, ఈ రబీ సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా కోటి 41 లక్షల టన్నుల వరి ఉత్పత్తి సాధించి తెలంగాణ రైతాంగం సత్తా చాటిందన్నారు. దేశ ప్రొడక్షన్‌లో 60 శాతం వాటా మనదేనని పేర్కొన్నారు. ‘‘హరీశ్‌రావు ప్రాజెక్టులు ఎలా నడపాలో మాకు ఉత్తరాలు రాస్తున్నాడు. నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకు ఇస్తేనే ఆయన నడుం విరిగి ఫామ్‌హౌస్‌లో పడ్డాడు. మాకు నీ సలహాలు వద్దు” అని అని ఎద్దేవా చేశారు. 2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో ప్రజాపాలనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏం చేశామా.. ఇదే చేశాం
రాష్ట్రంలోని 3 కోట్ల 28 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటు అర్హులైన వారందరికీ కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులను అందజేశామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా రూ.20,616 కోట్ల భారీ వ్యయంతో 25 లక్షల మంది అన్నదాతలకు ఏకకాలంలో రైతు రుణమాఫీ పూర్తి చేయడమే కాకుండా, రైతు భరోసా కింద మరో రూ.27వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
నిరుద్యోగ యువతకు భరోసానిస్తూ రికార్డు స్థాయిలో 67,716 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఆడబిడ్డలను వెయ్యి ఆర్టీసీ బస్సులకు యజమానులను చేస్తూ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాల కోసం రూ.10 వేల కోట్లు, మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ.60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని చెప్పారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, ఇటీవలే 25 వేల ఇండ్లను ప్రారంభించుకున్నామని.. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో మరో 2.5 లక్షలు, హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లను నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.
కందుకూరు ప్రాంతంలో టమాటాలు పండిస్తే సాస్ ఫ్యాక్టరీ
ఒకప్పుడు కల్వకుర్తి నుంచి బస్సుల్లో వస్తుంటే ఇరువైపులా పచ్చని ద్రాక్ష తోటలు, బస్సు నిండా కూరగాయలు, ఆకుకూరల బుట్టలతో వచ్చే రైతులు కనిపించేవారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కాలక్రమేణా ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు రావడంతో భూముల విలువలు పెరిగి, ఎకరాలు గజాలుగా మారి రియల్ ఎస్టేట్ విస్తరించడంతో వ్యవసాయం కుంటుపడిందన్నారు. ప్రస్తుతం కొత్తిమీర, కరివేపాకు కోసం కూడా పక్క రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి రావడం దారుణమని పేర్కొన్నారు.
కేవలం వడ్లు, పత్తి, మిర్చి, మక్కలాంటి నాలుగు పంటలకే పరిమితం కాకుండా.. మళ్లీ పాత రోజుల్లా తోటలు పెంచాలని సూచించారు. కందుకూరు ప్రాంతంలో టమాటాలు పండిస్తే అక్కడ సాస్ ఫ్యాక్టరీ తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం వాటా అందిస్తున్న రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితేనే తెలంగాణ బాగుపడుతుందని, రైతులు వడ్లతోపాటు తోటల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు.
