ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం.. కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం.. కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్
  • వడ్లు, మక్కలు యుద్ధప్రాతిపదికన సేకరించాలి 
  • క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించండి
  • ప్రతి ఐకేపీ సెంటర్‌, మిల్లు దగ్గర ఒక్కో అధికారిని పెట్టాలి
  • ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదు ఇచ్చేలా చూడాలి
  • కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా ఉన్న 10 జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం
  • ఏసీలో కూర్చొని పనిచేస్తామంటే చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.  కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు సెంటర్లకు వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్​కు తరలించాలని ఆదేశించారు.

ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని, అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దన్నారు.  ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌‌ను సీఎం ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతీ అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని రేవంత్​ ఆదేశించారు.

నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం ఎంసీహెచ్​ఆర్డీలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో  ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  వివిధ ప్రాంతాల్లో గోడౌన్స్ సమస్య ఉన్నట్టు తెలుస్తోందని, అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రైతుబజార్లు, ఫంక్షన్ హాల్స్‌‌ను ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్స్‌‌కు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. 

అకాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ
మక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలాచూడాలని సూచించారు. ధాన్యం సేకరణ, మక్క కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్​కు రిపోర్ట్ పంపించాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

అకాల వర్షాల టైంలో కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని, వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.

ట్రాక్టర్లు, ఇతర వాహనాలు వినియోగించుకోవాలి 
ప్రతీ ఐకేపీ సెంటర్‌‌కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.  ప్రతీ రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలన్నారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 

పంట కొనుగోళ్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ధాన్యం సేకరణ, మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందిస్తుందని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంత మంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు ధాన్యం తీసుకురాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

క్షేత్రస్థాయికి వెళ్లకుంటే పోస్టు మార్చేస్తం 
ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 10 జిల్లాల కలెక్టర్లపై సీఎం సీరియస్​ అయ్యారు. ఏయే కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు వచ్చాయో ఆ పేర్లను, రైస్​ మిల్లులో లోడ్​ దింపకపోవడం ఎక్కడ ఆలస్యం అవుతుందో వాటన్నింటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఏం చర్యలు తీసుకున్నారో.. ఆ రిపోర్ట్​ ఏమిటో వెంటనే చెప్పాలని సీఎం ఆదేశించారు. 

దీంతో ఆయా కలెక్టర్లు బుకాయించే ప్రయత్నం చేయగా.. ఇలాంటి వ్యవహారశైలి తన దగ్గర పనికిరాదని, ఏసీల్లో కూర్చుని పని చేస్తామంటే కుదరదని, అలాంటి పోస్టు కావాలంటే వెంటనే బదిలీకి రిక్వెస్ట్​ పెట్టుకోవచ్చునని హెచ్చరించినట్టు తెలిసింది.