ప్రాజెక్టుల భూసేకరణలో వేగం పెంచండి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రాజెక్టుల భూసేకరణలో వేగం పెంచండి : సీఎం రేవంత్ రెడ్డి
  •     ఇంకా ఎంత సేకరించాలి.. ఎన్ని నిధులు కావాలని సీఎం ఆరా
  •     సదర్మట్, చనాకా-కొరటా, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల పూర్తికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్ తో కలిసి సమీక్ష చేశారు. ఈ నెల 16న ఆదిలాబాద్ లో ప్రారంభించనున్న చనాక–కొరాటా బ్యారేజీ, సదర్మట్ బ్యారేజీలపై ఆరా తీశారు. వాటి కింద ఉన్న ఆయకట్టు, ఆ ఆయకట్టు మొత్తానికి నీళ్లందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆరా తీసినట్టు తెలిసింది. 

ఇంకా ఎంత మేర భూసేకరణ చెయ్యాలి, ఎన్ని నిధులు కావాలి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. దీంతోపాటు కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో ఉన్న చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలపైనా సమీక్ష చేశారు. పనులు ఎంత మేర పెండింగ్ ఉన్నాయి.. ఆ లిఫ్ట్ కు ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వీలయినంత త్వరగా దీనిని కూడా టేకప్ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం.