నేటి ( డిసెంబర్ 1 ) నుంచి 6 రోజులు జిల్లాల్లో సీఎం.. ప్రజాపాలన ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా హాజరు

నేటి ( డిసెంబర్ 1 ) నుంచి 6 రోజులు జిల్లాల్లో సీఎం.. ప్రజాపాలన ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా హాజరు
  • 7న ఓయూలోనూ ఉత్సవాలు.. అటెండ్​ కానున్న రేవంత్​
  • 13న ఉప్పల్​లో దిగ్గజ ఫుట్​బాల్ ప్లేయర్​ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్​ 
  • వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి రెండేండ్లు పూర్తికావస్తున్న సందర్భంగా ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, 3న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హుస్నాబాద్, 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో, 6న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఉత్సవాలు జరుపుతామని.. వీటిలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. 

ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతారన్నారు. ‘‘తెలంగాణ కేవలం దేశంతోనే కాదు, ప్రపంచంతోనే పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం కలిసి ‘తెలంగాణ రైజింగ్ 2047’ సమిట్ రోడ్డు మ్యాప్‌‌ను సిద్ధం చేశాం” అని ఆయన వెల్లడించారు. గ్లోబల్ సమిట్‌‌లో తాము విడుదల చేసే  తెలంగాణ విజన్‌‌ను తిలకించడానికి దేశంతో పాటు ప్రపంచంలో వివిధ రంగాల్లో రాణించిన వ్యవస్థలను, వాటికి నాయకత్వం వహించిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామన్నారు. 

గ్లోబల్ సమిట్‌‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌‌ను ప్రజలందరూ చూసేలా డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫుట్‌‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనల్ మెస్సీని హైదరాబాద్‌‌కు ఆహ్వానించి, డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌‌బాల్ మ్యాచ్‌‌ను నిర్వహించనున్నట్లు భట్టి వెల్లడించారు. 

4 లక్షల మంది సూచనలు: మంత్రి శ్రీధర్​బాబు

రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్‌‌ 2047’ విజన్ డాక్యుమెంట్‌‌ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌‌బాబు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌‌ 2047 విజన్​ డాక్యుమెంట్‌‌ పాలసీ 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినదన్నారు. దాని రూపకల్పనలో దాదాపు 4 లక్షల మంది ప్రజల సూచనలు, ముఖ్యంగా యువకుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. అన్ని రంగాల్లోని మేధావులు, నిపుణులతో ఇప్పటివరకు దాదాపు 70 సమావేశాలు ఏర్పాటు చేశామని, అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే విజన్ డాక్యుమెంట్​కు  తుది రూపు ఇస్తున్నామని తెలిపారు. 

7న ఓయూలో ఉత్సవాలు..సీఎం రేవంత్​ హాజరు

ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్​ 7న ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తామని, ఇందులోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని భట్టి తెలిపారు. వర్సిటీలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలపై మేధావులతో కలిసి సీఎం ఆలోచన చేస్తారని పేర్కొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమిట్ ఉంటుందన్నారు. 9న విజన్ డాక్యుమెంటరీని విడుదల చేస్తామన్నారు.