- వాళ్లు రాష్ట్రాన్ని కొల్లగొడ్తే.. మేం కంపెనీలను తెస్తున్నాం: సీఎం రేవంత్
- మా ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
- 1.79 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీలు ముందుకొచ్చినయ్
- దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలుగన్నయ్
- కేటీఆర్.. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నడు
- భారీ పెట్టుబడులను జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష నేతల విమర్శలు
- తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి బీఆర్ఎస్కు కడుపుమంటగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాళ్లు రాష్ట్రాన్ని దోచుకుంటే తాము పెట్టుబడులు తెస్తున్నామని చెప్పారు. రాజకీయంగా తమపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోమని, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం రాజకీయాలను పక్కన పెట్టాలని ప్రతిపక్షాలకు సూచించారు. తెలంగాణ అభివృద్ధికి అందరం కలసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ‘‘రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సానుకూలమైన అంశాలను స్వీకరించాల్సిందే. అందుకే గతంలో పాలించిన పార్టీల విధానాలు రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా ఉంటే, వాటిని స్వీకరించి కొనసాగిస్తున్నాం.
మంచి విధానాలు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా సరే.. వాటిని మేం కొనసాగిస్తాం. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని చెప్పారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వంపై నమ్మకంతో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా కంపెనీలు ముందుకొచ్చాయని ఆయన తెలిపారు. ‘‘దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలుగన్నాయి. పెట్టుబడులు రావొద్దని కోరుకున్నాయి. కానీ కంపెనీలు మాత్రం మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి” అని అన్నారు. రూ.లక్షా 79వేల కోట్ల పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేకనే.. ఒప్పందాలన్నీ బోగస్, కట్టుకథ అంటూ ప్రతిపక్ష నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కంపెనీలను అడిగి తెలుసుకోవచ్చు..
తమ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో పీవీ నర్సింహారావు హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలతో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలు ఇప్పుడు దోహదపడ్డాయని తెలిపారు.పెట్టుబడులను ఆకర్షించడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ‘‘దావోస్ వేదికగా ఈసారి రికార్డు స్థాయిలో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం దేశ, విదేశీ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నం. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో ఇది మొదటి అడుగు. ఆ లక్ష్యం సంపూర్ణమైనప్పుడే మాకు సంతోషంగా ఉంటుంది.
ఈ పెట్టుబడుల విషయంలో ప్రతిపక్ష నేతలు కొందరు అడ్డగోలు కామెంట్లు చేస్తున్నారు. కట్టుకథలని ఒకరు.. అబద్ధాలని ఇంకొకరు.. మాట్లాడుతున్నారు. ఏయే కంపెనీలతో ఎన్ని కోట్ల ఒప్పందం కుదిరిందో ఇప్పటికే ప్రకటించాం. అవసరమైతే ప్రతిపక్ష నేతలు ఆ కంపెనీలతో మాట్లాడి నిర్ధారణ చేసుకోవచ్చు” అని చెప్పారు. ‘‘మేం దావోస్ వెళ్లింది పెట్టుబడులు తీసుకురావడానికే. మేం కంపెనీల కార్యాలయాలకు వెళ్లలేదు. కంపెనీలే మా దగ్గరికి వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దావోస్‌లో ఏర్పాటు చేసిన పెవిలియన్ వేదికగానే ఈ ఒప్పందాలు జరిగాయి. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్ ను వెతుక్కుంటూ వచ్చారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంతో కొందరికి జీర్ణం కావడం లేదు. దీన్ని సోషల్ మీడియా ద్వారా అడ్డుకోవడానికి ఒకాయన కుట్రలకు పాల్పడుతున్నాడు. ఆయన అటెన్షన్ సీకింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు” అని కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
మాపై నమ్మకంతోనే పెట్టుబడులు..
తమ ప్రభుత్వ పాలన, తీసుకొచ్చిన విధానాలు, పాలసీలపై కంపెనీల ప్రతినిధులు విశ్వాసం కనబరిచారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో సంతృప్తి చెందినందునే సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ. 45 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిందని చెప్పారు. ‘‘పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనా దృష్టిపెట్టాం. ఇందుకోసం అవసరమైన నైపుణ్యాలను కూడా అందించాలనుకున్నాం. రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడంతో పాటు సింగపూర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌తోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం” అని వెల్లడించారు.
‘‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. దావోస్ వేదికగా కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తేవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాం. ఒప్పందాలతోనే సరిపెట్టుకోకుండా, అవి నెరవేరేలా చూసుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత. కంపెనీలకు కావాల్సిన భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం.. రాయితీలు అందిస్తాం. తెలంగాణ భవిష్యత్తులో అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఎదగాలి. వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కలిగి, దేశంలో నంబర్ వన్ గా నిలవాలి” అని ఆకాంక్షించారు. కాగా, సీఎంపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసు పెట్టిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన బానిస మనస్తత్వాన్ని ఇప్పటికైనా మార్చుకోవాలి. ఏడాది క్రితం ఆయన ఎలా మాట్లాడారో ఆలోచించుకోవాలి” అని సీఎం రేవంత్ బదులిచ్చారు.
ప్రజలకు క్వాలిటీ లైఫ్ అందిస్తం: శ్రీధర్ బాబు
ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని సద్విమర్శలుగానే తీసుకుంటామని, ప్రజలకు క్వాలిటీ లైఫ్ అందించాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘‘నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. సింగపూర్ ఐటీఈఎస్ తో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాది నుంచి స్కిల్ వర్సిటీ టీచర్లకు కరికులం విషయంలో వాళ్లు ట్రైనింగ్ ఇస్తారు. మరోవైపు స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ అంశాలపైనా చర్చించాం” అని తెలిపారు. ‘‘సింగపూర్ సంస్థలతో మేం జరిపిన చర్చలు సంతృప్తి కలిగించాయి. ప్రభుత్వ విధానాలపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. దావోస్ వేదికగా పోయినేడాది రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు జరగ్గా, ఈసారి అంతకు నాలుగు రెట్ల (లక్షా 79 వేల కోట్లు) పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మూసీ ప్రక్షాళన, నిరుద్యోగుల్లో నైపుణ్యాలు పెంపొందించే అంశాలపై సింగపూర్ మంత్రులతో సీఎం రేవంత్ చర్చించారు. మనకు సహకారం అందిస్తామని సింగపూర్ మంత్రులు చెప్పారు” అని పేర్కొన్నారు. సింగపూర్ నది చిన్నదే.. కానీ దాన్ని ప్రక్షాళన చేస్తే అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, సీతక్క పాల్గొన్నారు.
