బడి నుంచి దవాఖానా దాకా ఫేషియల్ అటెండెన్స్

బడి నుంచి దవాఖానా దాకా ఫేషియల్ అటెండెన్స్
  • విద్యా, వైద్య శాఖల్లో  ప్రతి ఉద్యోగికి ఫేషియల్​ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి: సీఎం రేవంత్‌‌
  • ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో ఫీల్డ్​కు వెళ్లని అధికారులపై కఠిన చర్యలు
  • విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు
  • 99 డేస్​ రివ్యూకు ప్రతి జిల్లాకూ ఓ సీనియర్‌‌‌‌ ఐఏఎస్‌‌ను స్పెషల్ ఆఫీసర్‌‌‌‌గా పంపించాలని  ఆదేశం

హైదరాబాద్, వెలుగు: విద్యా, వైద్య శాఖలు, పాలనలో విప్లవాత్మక మార్పుల కోసం అన్ని స్థాయిల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్‌‌‌‌సీల నుంచి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల వరకు ఉద్యోగులందరికీ ఇదే అటెండన్స్ విధానాన్ని పాటించాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు.  

రాష్ట్రస్థాయిలో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌‌‌‌పై సమీక్ష నిర్వహించినట్లే.. జిల్లాల వారీగా కూడా వెంటనే ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికపై సమీక్షలు జరపాలని ఆదేశించారు. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన‌‌‌‌‌‌‌‌–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

 ప్రతినెలా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని, వారిపై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వెంటనే వివరణ కోరాలని సీఎస్‌‌‌‌ను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులను అస్సలు ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలు తాము జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాల వివరాల నివేదికలను సమర్పించాయి. 99 రోజుల యాక్షన్ ప్లాన్‌‌‌‌లో చురుగ్గా పాల్గొన్న విభాగాలను  సీఎం అభినందించారు. 

అయితే, ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలను కొన్ని విభాగాలు ఆశించినంతగా చెప్పుకోలేకపోయారని తెలిపారు. వెంటనే అన్ని శాఖలు తాము చేపట్టిన కార్యక్రమాలకు తగినంత ప్రచారం కల్పించాలని, సంబంధిత ఉన్నతాధికారులు ఆ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తాము చేసిన మంచి పనులను వివరించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ ఆదేశాలను, క్షేత్రస్థాయి విధులను అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని  హెచ్చరించారు. 

పంచాయతీలకు భవన నిర్మాణాలు

వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌‌‌‌ను విధిగా నమోదు చేయాలని అధికారులను  సీఎం రేవంత్‌‌‌‌ ఆదేశించారు. గ్రామాల్లో వచ్చిన సమస్యలను కూడా ఆయా శాఖలు త్వరితగతిన పరిష్కరించాలని, ఈ మూడు నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన శంకుస్థాపనలు, ఆస్తుల వివరాలన్నీ పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ పంచాయతీ భవనాలు లేని గ్రామాలుంటే.. వెంటనే ఆ జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అక్కడ కొత్తగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను చేపట్టేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.