పైపై మెరుగులు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి.. కోర్ అర్బన్ సిటీలో 3 కేటగిరీలుగా విద్య: సీఎం రేవంత్

పైపై మెరుగులు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి.. కోర్ అర్బన్ సిటీలో 3 కేటగిరీలుగా విద్య: సీఎం రేవంత్
  • ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాల్లోనే ఉండాలి
  • ట్రాఫిక్ కంట్రోల్​కు డ్రోన్​ పోలీసింగ్​.. మోడర్న్​ సిగ్నల్​ వ్యవస్థ
  • డ్రైనేజీ, మ్యాన్‌‌‌‌‌‌‌‌హోల్స్ క్లీనింగ్‌‌‌‌‌‌‌‌కు రోబోలను వినియోగించాలి 
  • తెలంగాణ కోర్ అర్బన్ సిటీపై సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో అధికారులతో సమీక్ష 

హైదరాబాద్, వెలుగు:  పైపై మెరుగులు కాకుండా.. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తెలంగాణ కోర్ అర్బన్ సిటీని అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  ఆదేశించారు.  ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దంపట్టే  గ్లోబల్ సిటీకి చిరునామాగా డెవలప్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలని దిశానిర్దేశం చేశారు. 

తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియా అభివృద్ధిపై సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సిటీలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా అందించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. 

కోర్ అర్బన్ సిటీలో మున్సిపల్, పోలీస్, విద్యుత్తు, జలమండలి విభాగాల యూనిట్లు, వాటిని పర్యవేక్షించే అధికారుల పరిధి ఒకేతీరుగా ఉండాలని సూచించారు.  అన్ని విభాగాలు ఏరియాను, అధికారుల హోదాలను పునర్వవస్థీకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ జయేశ్‌‌‌‌‌‌‌‌ రంజన్.. 5  ప్రధాన అంశాలు, 111 ప్రతిపాదనలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభివృద్ధి ప్రణాళికను వివరించారు.

ప్రత్యేక చిల్డ్రన్​ ప్లే జోన్స్ గా పార్కులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ప్రపంచంలోనే క్లీన్ సిటీ ఇమేజ్ తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ శాఖలోని డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ శుభ్రం చేయడానికి రోబోలను ఉపయోగించాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్కులను సుందరీకరించి, హుస్సేన్ సాగర్ 2.0ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు. 

సిటీలోని పార్కులన్నీ సీనియర్ సిటిజన్లకే కాకుండా, పిల్లలను ఆకట్టుకునేలా ప్రత్యేక చిల్డ్రన్​​ ప్లే జోన్స్ గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీలో ఒక్క ప్రభుత్వ ఆఫీస్ కూడా అద్దె భవనాల్లో ఉండేందుకు వీల్లేదని, ప్రతి ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు సొంత భవనం ఉండాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. వాటికి అవసరమైన స్థలాలు కేటాయించాలని, ప్రాధాన్య క్రమంలో  భవనాలు నిర్మించే ప్రణాళిక తయారు చేయాలన్నారు. 

సెక్రెటేరియెట్‌‌‌‌‌‌‌‌తోపాటు  సిటీలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలపై సోలార్ విద్యుత్తు ప్లాంట్లు అమర్చాలని ఆదేశించారు.   నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలన్నారు.   

ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌పై స్టడీ చేయాలి 

సిటీలో గంటలకొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్టడీ జరగాలని,  ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. సిటీలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  అనుసంధానం చేయాలని చెప్పారు. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళికను వెంటనే అమలు చేయాలని  పోలీసు విభాగాన్ని ఆదేశించారు.  ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలిసింగ్ విధానం అమలు చేయాలని  సూచించారు.

 వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలన్నారు. సిటీలో వర్షం పడినప్పుడు జంక్షన్లలో నీళ్లు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్‌‌‌‌‌‌‌‌ను నిర్మించాలని ఆదేశించారు.  అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట శ్మశాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలని సూచించారు.    డ్రగ్స్, గంజాయి తీసుకొని పట్టుబడితే బాధితులుగా చూడవద్దని, కనీసం పదిరోజులపాటు రీహాబిలిటేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచాలని సూచించారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించాలని తెలిపారు. ఈ సెంటర్ నిర్వహణ, పర్యవేక్షణకు ఎక్స్ మిలిటరీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రత్యేక క్లినిక్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేయాలి

కోర్ అర్బన్ సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రాథమిక విద్యను అందరికీ అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు.  పేదలందరికీ తక్షణ వైద్య సాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక క్లినిక్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలన్నారు.  జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలన్నారు. 

 నర్సరీ –4వ తరగతి, 5–8వ తరగతి, 9వ తరగతి – ఇంటర్ సెకండియర్ వరకు 3 కేటగిరీలుగా నాణ్యమైన విద్యను అందరికీ అందించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి స్కూళ్లపై ముందుగా ఫోకస్ చేయాలని, ప్రభుత్వ స్థలాలు, ఇటీవల కబ్జాలు, ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలని సూచించారు.  . పిల్లలకు బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కూడా స్కూల్లోనే అందించి, ప్రభుత్వం తరఫున ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అందించాలన్నారు.