మేడారంలో మంత్రులకు సీఎం విందు..మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రైతో డిన్నర్

మేడారంలో మంత్రులకు సీఎం విందు..మటన్ కర్రీ, నాటుకోడి  పులుసు, చికెన్ ఫ్రైతో డిన్నర్

వరంగల్‍/ములుగు, వెలుగు: మేడారంలో ఆదివారం రాత్రి రాష్ట్ర మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ సంప్రదాయ వంటకాలకు పెద్దపీట వేశారు. మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై వంటి నాన్‌‌వెజ్‌‌ వంటకాలు వడ్డించారు. అలాగే, సకినాలు, గారెలు వంటి సంప్రదాయ పిండి వంటకాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 

ఈ విందు సందర్భంగా ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది. ‘‘మనపై బురదజల్లే వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం సజావుగా సాగుతున్న తరుణంలో మన మధ్య చిచ్చు పెట్టేందుకు, మంత్రుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తున్నారు’’ అని సీఎం అన్నట్టు సమాచారం. ‘‘కేబినెట్‌‌లో, పార్టీలో ఐక్యతను దెబ్బతీసే వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. 

మనమంతా ఒక్కటిగా ఉండి ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా, వారు ఎంతటి వారైనాసరే ఉపేక్షించేది లేదు. కుట్రపూరిత కథనాలు, వ్యవహారాలపై ఎలాంటి చర్యలకైనా వెనుకాడను” అని స్పష్టం చేసినట్టు తెలిసింది. మంత్రులు కూడా ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు.