హైదరాబాద్ కా నిషాన్.. నుమాయిష్

హైదరాబాద్ కా నిషాన్.. నుమాయిష్
  • నాంపల్లి ఎగ్జిబిషన్‌‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • సొసైటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ 
  • సొసైటీలో పదేండ్లుగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి 
  • నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌ను ప్రారంభించిన సీఎం 

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ కా నిషాన్.. నుమాయిష్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ తర్వాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌‌‌లో మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి 83వ నుమాయిష్‌‌‌‌ను రేవంత్‌‌‌‌ ప్రారంభించి, మాట్లాడారు. ఏటా నుమాయిష్‌‌‌‌కు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గకుండా ఎగ్జిబిషన్‌‌‌‌ నిర్వహిస్తున్న సొసైటీని ఆయన అభినందించారు. నుమాయిష్‌‌‌‌లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తలు పాల్గొంటారని చెప్పారు. కాశ్మీర్ తివాచి నుంచి దేశంలోని రకరకాల వస్తువులు ఇక్కడ ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యాన్ని సీఎం కొనియాడారు. యంగ్ ఎంట్రప్రెన్యూయర్లకు కూడా అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీలో పదేండ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా అప్‌‌‌‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. హైదరాబాద్‌‌‌‌కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్‌‌‌‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గతంలో తాను కూడా నుమాయిష్‌‌‌‌కు వచ్చి ఫుడ్ కోర్ట్‌‌‌‌లను విజిట్ చేసేవాడినని, ఈ ఏడాది కూడా రావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఎగ్జిబిషన్‌‌‌‌కు వచ్చే వ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

తెలంగాణకు గర్వకారణం :  శ్రీధర్ బాబు

నుమాయిష్‌‌‌‌ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సొసైటీ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నిజాం కాలం నుంచి ఈ ప్రదర్శన జరుగుతున్నదని, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ విజయవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజల నుంచి రూపాయి ఆశించకుండా, సొసైటీ డబ్బులతోనే 20 విద్యా సంస్థలను నడుపుతున్నారని కొనియాడారు. అలాగే, 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనతో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని, ఈ ఎగ్జిబిషన్‌‌‌‌ ఎంతో మంది వ్యాపారస్తులను తయారు చేసిందన్నారు. సొసైటీలో సమస్యలు సీఎంకు విన్నవించామని, వాటిని పరిష్కారిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరారని, ఆ మార్పు ఇక్కడి నుంచే చూపిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్, ట్రెజరర్ రాజేందర్ కుమార్, సెక్రటరీ హనుమంతరావు, సొసైటీ మెంబర్స్ పాల్గొన్నారు. 

ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్‌‌‌‌..

నుమాయిస్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్‌‌‌‌లో 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది. వీకెండ్స్, సెలవు దినాల్లో 3 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.40 కాగా, ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. మహిళలు, పిల్లల కోసం స్పెషల్‌‌‌‌గా ఒక్కో రోజు కేటాయించారు. ఈ నెల 9న మహిళలు, 31న పిల్లలు సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉచిత బస్సు కారణంగా ఎగ్జిబిషన్‌‌‌‌కు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోందని, ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే మెట్రో ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఎగ్జిబిషన్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో మెట్రో కౌంటర్ కూడా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.