
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇండ్లిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డిలోని GR కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద ప్రభావం ఎక్కువగా ఉందని పరిశీలనలో సీఎం గుర్తించారు. తాము పరామర్శించుడు మాత్రమే కాదని సాయం చేస్తామని వరద బాధితుల్లో సీఎం ధైర్యం నింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలన్నీ వంద శాతం పరిష్కరిస్తామని చెప్పారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలు నష్టపోయి ఉంటే ఆదుకుంటామని, CSRకు ఫండ్ ఇస్తే పేదలకు సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి తనకు సొంత నియోజకవర్గం లాంటిదని సీఎం చెప్పారు.
వందేళ్లలో రానంత వరద వచ్చిందని, ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు నాయకులు తోడుగా ఉండాలని, భారీ వరదలకు పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడిందని వరద బాధితులను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించారు. పంట నష్టంపై నివేదిక రాగానే ఆర్థిక సాయం అందిస్తామని సీఎం రేవంత్ రైతులకు హామీ ఇచ్చారు. బుడిగిడ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను సీఎం పరిశీలించారు. లింగంపేట దగ్గర వరదకు కొట్టుకుపోయిన బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వరద నష్టంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.