గవర్నర్ తో సీఎం భేటీ..జూన్ 12న స్టూడెంట్స్ సభకు రావాలని విజ్ఞప్తి

గవర్నర్ తో సీఎం భేటీ..జూన్ 12న స్టూడెంట్స్ సభకు రావాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యార్థులను డ్రగ్స్ కు దూరంగా ఉంచి, బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 12వ తేదీన(స్కూల్స్ రీఓపెన్) విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహించి, వారితో 'యాంటీ డ్రగ్స్' ప్రతిజ్ఞ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ సోమవారం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఏర్పాట్లను, ప్రభుత్వ ఉద్దేశాన్ని గవర్నర్‌కు వివరించారు.

స్టూడెంట్స్ సభకు అటెండ్ అవ్వాలని కోరారు. గతంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సీఎంతో భేటీ అయిన సందర్భంలో.. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాలని, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. గవర్నర్ ఇచ్చిన ఈ విలువైన సూచనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలి రోజుల్లోనే స్టూడెంట్స్ సభ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ సభలో పొగాకు, మద్యం, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులందరితో సామూహికంగా ప్రతిజ్ఞ చేయించనున్నారు. దేశాభివృద్ధిలో బాధ్యతగల పౌరులుగా భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రమాణం చేయనున్నారు.