
- ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతం
- అహంకారం, బంధుప్రీతికి మా పాలనలో తావులేదు: సీఎం రేవంత్రెడ్డి
- కృష్ణా జలాల కోసం న్యాయ పోరాటం.. సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
- త్వరలో మరిన్ని మహిళా మార్ట్లు.. 20 నెలల్లో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం
- గేట్‌వే ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతం
- గంజాయి, డ్రగ్స్ దందాలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం
- ఫామ్‌హౌస్‌లో దాక్కున్నా, బొక్కలో దాక్కున్నా కటకటాలపాలే
- మూసీ రివర్ ఫ్రంట్‌తో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తం
- భవిష్యత్తులో ఎక్స్‌ప్రెస్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్ వస్తుందని వెల్లడి
- ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సన్న బియ్యం పథకానికి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిందని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి స్కీమ్ లేదని తెలిపారు. హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై వెనక్కి తగ్గబోమని, కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను 2027 డిసెంబర్ లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు.
‘‘అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, పక్షపాతం వంటి వాటికి మా ప్రజా పాలనలో తావు లేదు. హైదరాబాద్‌ను గేట్‌వే ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దుతం. గంజాయి, డ్రగ్స్ దందాల్లో ఎంత
పెద్దవారు ఉన్నా ప్రభుత్వం వదిలిపెట్టబోదు. ఫామ్‌హౌస్‌లోనే కాదు బొక్కలో దాక్కున్నా.. పోలీసు వ్యవస్థ లాక్కొచ్చి కటకటాల వెనకాల వేస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్లో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెం డాను ఆవిష్కరించి ప్రసంగించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పనిచేస్తున్నామని, మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎస్ఎల్బీసీ ఆగదు
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశామని సీఎం రేవంత్ తెలిపారు. రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని.. ఏడాది కాలంలో రూ.1.90 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బు జమ చేస్తున్నామని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని ఆయన వివరించారు. ‘‘సన్న బియ్యం సంక్షేమ పథకానికి ఈరోజు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ. దేశంలోనే మరే రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. 3.10 కోట్ల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నం. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
ఈ ఏడాది 2.80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది” అని పేర్కొన్నారు. హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటం చేస్తం. ఈ పోరాటం కోసం ఇప్పటికే ఇంజనీర్లు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినం” అని తెలిపారు. ‘‘ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను 2027 డిసెంబర్‌లోగా పూర్తి చేస్తం. దీనివల్ల ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమై, 3.60 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేయబోం” అని ఆయన స్పష్టం చేశారు.
విద్య, మహిళా సాధికారత..
భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడి
విద్యను విజయానికి వజ్రాయుధంగా తాను బలంగా విశ్వసిస్తున్నానని సీఎం తెలిపారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలంగాణ యువత ఎదగాలని, అందుకే గొప్ప విజన్‌తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభించామని చెప్పారు. విద్యపై చేసే వ్యయం ఖర్చు కాదని.. అది భవిష్యత్ పెట్టుబడి అని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండి యా పోలీస్ స్కూల్ వంటివి భవిష్యత్తుకు భరోసా కేంద్రాలుగా మారుతాయన్నారు.
ఆడబిడ్డల విజయ గాథలు దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఇందిరా మహిళాశక్తి పాలసీతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వివరించారు. నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా 6 నెల ల్లో రూ.15.50 లక్షల లాభం వచ్చిందని, ఖమ్మంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ విజయవంతంగా నడుస్తున్నదని, త్వరలో మరికొన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.
అఖిల భారత సర్వీసులకు వెళ్లాలనుకునే తెలంగాణ యువత కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ సహాయం పొందిన వారిలో ఇప్పటివరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం గర్వకారణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూ వ్యవస్థను సరిదిద్ది, భూభారతి చట్టం తీసుకొచ్చి, 5 వేల మంది గ్రామ పాలన అధికారులను నియమించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని ఆయన చెప్పారు.
మూసీ వెంట నైట్ ఎకానమీ
హైదరాబాద్ సిటీ తెలంగాణకు ఒక బ్రాండ్ అని, ఈ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘హైదరాబాద్‌ను గేట్‌వే ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నం. 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యం. ఈ లక్ష్యం సాధించిన తర్వాత హైదరాబాద్ కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికే గేట్‌వేగా మారుతుంది. లక్ష కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది” అని వివరించారు.
హైదరాబాద్‌లోని 100 ఏండ్ల తాగునీటి అవసరాలను తీర్చడానికి రూ.7,360 కోట్లతో గోదావరి జలాలను తీసుకురావడానికి రెండవ, మూడవ దశ పనులను ప్రారంభించామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. గుజరాత్‌లోని సబర్మతి, ఢిల్లీలోని గంగా నది, ఉత్తరప్రదేశ్‌లోని యమునా నదుల తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల మూసీ పరీవాహక ప్రాంతంలోని పేదల జీవితాలు దుర్బరమయ్యాయని, వారికి మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తామని చెప్పారు.
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఒక నైట్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతామని.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు నిరంతరం జరిగేలా ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని సీఎం తెలిపారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు నిర్మిస్తామని.. తెలంగాణ చరిత్రకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల విగ్రహాలను నెలకొల్పి ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికలను ఈ ఏడాది డిసెంబర్ 9లోగా ప్రారంభిస్తామని తెలిపారు.
ఓఆర్ఆర్ పై తలపెట్టిన గేట్‌వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టు గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుందన్నారు. రూ.24,000 కోట్ల అంచనాతో మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని, ప్రస్తుతం ఉన్న 69 కి.మీ. మెట్రో మార్గానికి అదనంగా 77 కి.మీ. మేర నిర్మిస్తామని చెప్పారు. ఈ పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆయన వివరించారు.
మంచి ప్రయత్నాలను తప్పుపట్టే వారిని బహిష్కరించాలి
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాపారాలను పూర్తిగా అరికడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ శాశ్వతంగా స్థిరనివాసం ఏర్పరచుకొని డ్రగ్స్, గంజాయి వ్యాపారాలు చేసే వారిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామని, వారిని కూడా పట్టుకుం టామని తెలిపారు. తల్లిదండ్రులు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. జీవితంలో ఎంత కష్టపడి ఆస్తులు సంపాదించినా, పిల్లలు వ్యసనపరులైతే ఆ బాధ వర్ణించలే నిదని అన్నారు.
డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాజకీయా లకు అతీతంగా సహకరించాలని.. ప్రభుత్వ ప్రయత్నాలను తప్పుపట్టే వారిని తెలంగాణ సమా జం బహిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ తెలంగాణ గడ్డ పోరాటాలకు, త్యాగాలకు వేదిక. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్న.. తెలంగాణను గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలుపుత” అని చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, బుల్లెట్ ట్రైన్
తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, ఇది రాబోయే వందేండ్లకు అభివృద్ధి నమూనాగా నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు. దీన్ని డిసెం బర్ 9న ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతు న్నామని, ఇది ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెంది న నగరంగా మారుతుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు 360 కిలో మీటర్లతో పాటు రీజినల్ రింగ్ రైల్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింద ని.. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు కొత్తగా రేడియల్ రోడ్లు వేయనున్నామ ని చెప్పారు.
‘‘భవిష్యత్తులో ఎక్స్‌ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనకు వస్తుంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరా వతి, చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాద నలు ఉన్నయ్. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి.. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు. సాయుధ పోరాటంతో సాధించుకున్న ప్రజాస్వామ్యమే నేటి తెలంగాణ అని.. ఈ పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించద గినదన్నారు. వందలాది మంది అమరుల త్యాగా లను స్మరించుకుంటూ, వారికి నివాళులర్పిస్తున్న ట్లు తెలిపారు.
గతంలో నియంతృత్వ పాలనలోకి జారిపోయిన స్వరాష్ట్ర ప్రస్తానాన్ని సరిదిద్దుతూ, నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజలు 2023 డిసెంబర్ 7న ప్రజాపాలనను తెచ్చుకున్నా రని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను ప్రామాణికంగా తీసు కుని పరిపాలన సాగిస్తున్నదన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కండ్లలా భావించి తెలంగా ణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
సాయుధ పోరాటంతో సాధించుకున్న ప్రజాస్వామ్యమే నేటి తెలంగాణ. ఈ పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. రాచరికానికి గోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు 1948 సెప్టెంబర్ 17. నియంతృత్వ పాలనలోకి జారిపోయిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానాన్ని సరిదిద్దుతూ, నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజలు 2023 డిసెంబర్ 7న ప్రజాపాలనను తెచ్చుకున్నరు. ప్రజల ఆకాంక్షలే ప్రామాణికంగా పాలన సాగిస్తున్నం. సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లుగా భావించి తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతం.
- సీఎం రేవంత్రెడ్డి