ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే: రేవంత్ రెడ్డి

ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే: రేవంత్ రెడ్డి
  • 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2019లో ఎంపీగా గెలిచిన 
  • ఆ తర్వాత పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి అయ్యాను 
  • గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తం
  • బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని సీఎం హామీ

హైదరాబాద్, వెలుగు: ఒక్కోసారి ఓటమి కూడా మంచిదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఒక్కోసారి ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేను.. 2019లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచాను. ఢిల్లీకి వెళ్లడంతో అధినాయకుల దృష్టిలో పడ్డాను. పార్లమెంట్ లో నేను చేసిన ప్రయత్నాలు, పార్టీలో నా కమిట్ మెంట్ చూసి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాను. 2018లో ఓడిపోవడం, 2019లో వచ్చిన అవకాశం వల్ల 2023లో సీఎం అయ్యాను. జీవన్ రెడ్డికి కూడా అట్ల అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను” అని చెప్పారు.

 మంగళవారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ డెక్కన్‌‌‌‌లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్‌‌‌‌ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘బోర్డు ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తున్నం. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రజా భవన్‌‌‌‌లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దీనికి ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తాం. టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ను కూడా అందుబాటులోకి తెస్తాం” అని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు .. త్వరలో గల్ఫ్ పాలసీ.. 

రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కుటుంబాలు గల్ఫ్‌‌‌‌ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని రేవంత్ తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని చెప్పారు. ‘‘ఏజెంట్ల చేతిలో కొందరు కార్మికులు మోసపోతున్నారు. మరికొందరు యాజమాన్యం చేతిలో ఇబ్బందులకు గురవుతున్నారు. సెప్టెంబర్ 17లోగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ఫిలిప్పీన్స్ విధానాలను అధ్యయనం చేశాం. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా పరిశీలించాం. 

గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఎన్నికల కోడ్ ముగిశాక కార్మికులను ఆహ్వానించి.. ఆ పాలసీపై అభిప్రాయాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తాం” అని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘ఇకపై ఏజెంట్ల మోసాలు లేకుండా చేస్తాం. ఏజెంట్లు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకునేలా విధానాలు తెస్తాం. గల్ఫ్ వెళ్లే వారికి వారం పాటు శిక్షణ అందిస్తాం. బీమా సౌకర్యం కూడా కల్పిస్తాం. గల్ఫ్ బాధితుల పిల్లలను ప్రభుత్వమే చదివిస్తుంది” అని హామీ ఇచ్చారు. ‘‘గల్ఫ్ కార్మికుల సమస్యలన్నీ రాష్ట్రం ప్రభుత్వంతోనే పరిష్కారం కావు. కొన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉంటాయి. అందుకే పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.