మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​లో విక్టరీ కొట్టాలి : సీఎం రేవంత్​రెడ్డి

మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​లో విక్టరీ కొట్టాలి : సీఎం రేవంత్​రెడ్డి
  • ఉమ్మడి మహబూబ్​నగర్ నేతలతో రేవంత్ రెడ్డి
  • గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

హైదరాబాద్​, వెలుగు: పోలింగ్​ బూత్​ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకొని, సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా నేతలతో ఆదివారం ఆయన సమావేశం అయ్యారు. మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్​ నియోజకవర్గాల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై రెండు గంటల పాటు చర్చించారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, రెండు స్థానాలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవను ప్రజలకు వివరించాలని సూచించారు.

వంద రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్​ అమలు చేసిన గ్యారెంటీలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. నేతలు సమష్టిగా పనిచేసి, ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

రాష్ట్ర  ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగ దేశమంతటా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతుందని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హరివిల్లుగా, శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా నిలిచే హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.