ఉపాధికి ఎసరు..పేదల పొట్టకొట్టేలా కేంద్రం కొత్త చట్టం : సీఎం రేవంత్రెడ్డి

ఉపాధికి ఎసరు..పేదల పొట్టకొట్టేలా కేంద్రం కొత్త చట్టం : సీఎం రేవంత్రెడ్డి
  •     ఉపాధి హామీ పథకం ఆత్మను చంపేస్తున్నరు: సీఎం రేవంత్​రెడ్డి
  •     మహాత్ముడి పేరు తొలగింపు.. నిధుల కోతకు భారీ కుట్ర
  •     రాష్ట్రాలపై 40% భారం.. కూలీలకు అన్యాయమని వెల్లడి
  •     పాత స్కీమ్​నే కొనసాగించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్, వెలుగు: పేదల హక్కులను కాలరాస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ఉన్న ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టం (వీబీజీ రామ్ జీ 2025)’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహాత్ముడి పేరును తొలగించి, నిధుల భారాన్ని రాష్ట్రాలపై నెట్టే ఈ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, పాత విధానం ప్రకారమే 100 శాతం నిధులను కేంద్రమే భరించాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) చట్టంతో పాటు పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో శుక్రవారం తీర్మానం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాడు కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ పేదల కన్నీళ్లు తుడవడానికి తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిబంధనల పేరుతో నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీ పీఠం కదిలేలా నిరసన తెలపాలని సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త చట్టం గ్రామీణ మహిళల పాలిట శాపంగా మారనుందని సీఎం అన్నారు. 

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 62 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరందరికీ కొత్త చట్టం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. పాత విధానంలో డిమాండ్ కు అనుగుణంగా పనులు కల్పించే వెసులుబాటు ఉండగా, కొత్త చట్టంలో పరిమిత కేటాయింపుల పేరుతో పని దినాలను కుదించడం దారుణమన్నారు. దీనివల్ల పేద కుటుంబాల ఆదాయం పడిపోవడమే కాకుండా, మహిళా సాధికారత అనే మాటకు అర్థం లేకుండా పోతుందన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులు, నిరుపేదలకు కనీస ఉపాధి కల్పించి, వారికి ఆర్థిక భరోసాను అందించాలన్న గొప్ప సంకల్పంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ చొరవతో 2005లో ఈ చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. 2006 ఫిబ్రవరి 2న అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా గత 20 ఏళ్లలో మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో 90 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే ఉన్నారని తెలిపారు. ఇటువంటి గొప్ప పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

సమాఖ్య స్ఫూర్తికి తూట్లు.. రాష్ట్రాలపై భారం

ఇన్నాళ్లుగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ రాగా, ఇప్పుడు కొత్త చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్రాల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమేనని సీఎం మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలపై ఈ నిబంధన ద్వారా అదనపు ఆర్థిక భారాన్ని మోపడం కేంద్రం చేస్తున్న కుట్రగా తెలిపారు. పాత విధానం ప్రకారమే 100 శాతం నిధులను కేంద్రమే భరించాలని సభ ద్వారా తీర్మానిస్తున్నట్లు తెలిపారు.

వలసల కన్నీళ్లు తుడిచిన పథకం ఇది

పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్లే దుస్థితిని ఈ చట్టం ఎంతో కొంత నివారించిందని రేవంత్ తెలిపారు. మట్టి పని ఎక్కడ జరిగినా అక్కడ పాలమూరు బిడ్డలు ఉండేవారని, కానీ ఉపాధి హామీ వచ్చిన తర్వాత సొంత ఊర్లోనే పని దొరికి, తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ, ఆత్మగౌరవంతో బతికే అవకాశం పేదలకు దక్కిందన్నారు. ఇప్పుడు కేంద్రం తెస్తున్న చట్టం వల్ల మళ్లీ పేదలు పొట్ట చేతబట్టుకుని పట్టణాలకు వలసలు పోయే ప్రమాదం ఉందన్నారు. సొంత ఊరిలో పని హక్కును కాలరాస్తే మళ్లీ పల్లెలు కన్నీరు పెడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలకు అతీతంగా పోరాడుదాం

పేదల బతుకులకు సంబంధించిన ఈ జీవన్మరణ సమస్యపై రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సభలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని బలపరచాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అత్యంత నిరుపేదలైన దళిత, గిరిజన, బలహీన వర్గాల కోసం, కూలీల కష్టాన్ని కాపాడటం కోసం మనం ఒక్కటిగా నిలబడాలన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకుని, పాత చట్టాన్ని యథాతథంగా కొనసాగించేలా మన గళం ఢిల్లీకి వినిపించాలని కోరారు. సీఎం విజ్ఞప్తి మేరకు స్పీకర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి, కేంద్రం తీరుపై తమ నిరసనను వ్యక్తం చేసింది.

నిరుపేద కూలీల  నోట్లో మట్టికొట్టొద్దు..

కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్లో తప్పనిసరిగా 60 రోజుల విరామం  ఉండాలనే నిబంధన పెట్టడం భూమి లేని నిరుపేద కూలీల నోట్లో మట్టికొట్టడమేనని సీఎం పేర్కొన్నారు. అసలే భూమి లేక, వ్యవసాయ పనులు దొరక్క అలమటించే పేదలు ఆ సమయంలో ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాల్సింది పోయి, ఇలా విరామాలు ప్రకటించడం అన్యాయమన్నారు. అలాగే, ప్రస్తుతం ఉన్న 266 రకాల పనుల జాబితా నుంచి భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడం వల్ల చిన్న, సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారన్నారు.