వెనిజులాపై అమెరికా దాడి అసలు కారణం ఇదేనా?..కమలా హారీస్ చెబుతుంది నిజమేనా!

వెనిజులాపై అమెరికా దాడి అసలు కారణం ఇదేనా?..కమలా హారీస్ చెబుతుంది నిజమేనా!

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ అరెస్ట్‌, ఆ తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలను యూఎస్‌ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తీవ్రంగా తప్పుబట్టారు.ఈ చర్యలు డ్రగ్స్‌ లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, పూర్తిగా ఆయిల్‌ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం X  ద్వారా స్పందించిన కమలా హారిస్‌..ట్రంప్‌ చర్యలు అమెరికాకు అంత  సురక్షితం కాదన్నారు. ట్రంప్ చర్యలతో  అమెరికన్ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు కమలా హారీస్. 

వెనిజులాపై  అమెరికా అధ్యక్షుడు దండెత్తిన విషయం తెలిసిందే..వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో , అతని భార్యను బందీలుగా అమెరికాకు తరలించిన ట్రంప్..నార్కో-టెర్రరిజం ఆరోపణలపై న్యూయార్క్ కోర్టులో విచారించనున్నారు. దశాబ్దాలుగా, డ్రగ్స్ అక్రమ రవాణా, చట్టవిరుద్దమైన పనులకు అధికార దుర్వినియోగం చేశాడని, టన్నుల కొద్దీ కొకైన్‌ తయారీ, రవాణాతో జేబులు నింపుకున్నారని అభియోగాలు మోపారు. 

మరోవైపు ముదురో, అతని భార్య అరెస్ట్ ను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోపిస్తున్నట్లు ముదురో డ్రగ్స్ అధిపతి కావచ్చు లేదా కాకపోవచ్చు..మదురో అమెరికాపై సైనిక దాడికి ప్రణాళిక వేస్తున్నాడని ఎలాంటి రుజువులు లేవని వాదిస్తుంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. ఒక దేశం మరొక దేశంపై దాడి చేయాలంటే ఏకైక ఆధారం ఆత్మరక్షణ. వైఫల్యాలు ఎలా ఉన్నా అధికారం కోసం మరొక దేశంపై దాడి చేయడం అంతర్జాతీయ చార్టర్‌ను ఉల్లంఘించడమే అని విమర్శించింది. 

చమురు కోసమేనా దాడి?

వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. ఆ దేశం చమురు నిల్వలు 300 బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండవచ్చని అంచనా.. వెనిజులా ముడి చమురు నిల్వలు ప్రపంచంలోని మొత్తంలో 17శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఉత్పత్తి సామర్థ్యంలో వెనిజులా వెనకబడి ఉంది. 1999లో అప్పటి వెనిజులా అధ్యక్షుడు హ్యుగో చావెజ్ హయాంలో రోజుకు 3.5 మిలియన్  బ్యారెళ్ల  చమురు ఉత్పత్తి  చేసింది వెనిజులా. ఆ టైం లో ప్రపంచంలో టాప్ 10 ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా నిలిచింది. 

ప్రస్తుతం వెనిజులా చమురు ఉత్పత్రి బాగా తగ్గింది. రోజుకు 1మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి  అవుతోంది.. నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, పెట్టుబడి లేమి, అవినీతి వెనిజులా దేశ చమురు పరిశ్రమను,ఆ దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేశాయి. 

వెనిజులా రాజధాని కారకస్ పై దాడి.. ఆదేశ నాయకుడిని బందీగా తీసుకున్న తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు..కేవలం చమురు కోసమే వెనిజులాపై దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. అమెరికాలోని అతిపెద్ద చమురు కంపెనీల సాయంతో వెనిజులా చమురు పరిశ్రను అభివృద్ది చేస్తామని  ట్రంప్ హామీ ఇవ్వడం..చమురుకోసమే వెనిజులా పై దాడి చేసినట్లు కనిపిస్తోంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. నార్కో టెర్రరిజం పేరుతో వెనిజులాపై దాడిని ఆత్మరక్షణ చర్యగా చెప్పుకుంటున్నట్లు ట్రంప్ ఉద్దేశం వెనక అసలు ఇది అని కమలా హారీస్  విమర్శించింది.