హైదరాబాద్లో మరిన్ని డంప్ యార్డులకు సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్లో మరిన్ని డంప్ యార్డులకు సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

 కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్ లను పరిశీలించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ చెప్పారు.

చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టిఎస్ఎస్పీడీసిఎల్ తో సమన్వయం చేసుకోవాలని  అధికారులకు సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు వున్నది. ప్రతి రోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతుంది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చుట్టు ప్రక్కల వుండే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.