భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తల్లిని హత్య చేసిన కేసులో కొడుకుకు జీవిత ఖైదు విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు నిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ప్రాంతంలోని తిలక్‌నగర్‌కు చెందిన లోద్ దులారీబాయి, శ్యాంలాల్ దంపతుల కొడుకు లోద్రమేశ్ మద్యానికి బానిసై తరుచూ తల్లిదండ్రులు, భార్యతో గొడవ పడేవాడు.
బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లగా, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, పెద్దలు పంచాయితీ పెట్టి ఇద్దరిని కలిపారు. ఈక్రమంలో గత ఏడాది మే 10న చికెన్ తీసుకువచ్చి వండమని తల్లికి ఇచ్చాడు. చికెన్ సరిపోలేదని తల్లిపై కత్తి, ఇనుప రాడ్‌తో దాడికి దిగాడు. అడ్డు వచ్చిన తండ్రితో పాటు కొడుకులను కొట్టి పారిపోయాడు. తీవ్రగాయాలపాలైన వారిని బంధువులు హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ దూలారీబాయి చనిపోయింది.
కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో 15 మంది సాక్షులను విచారించగా, నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
