రోజుకు 12 గంటలు.. 6 రోజులు పని చేస్తేనే బాగుపడతాం : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

రోజుకు 12 గంటలు.. 6 రోజులు పని చేస్తేనే బాగుపడతాం : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి యువత ఎక్కువ పనిచేయాలి, వారానికి 70 గంటలు కష్టపడాలి అని చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలతో పాటు సానుకూలత చూసిన సంగతి తెలిసిందే. ఎవ్వరు ఎన్ని అన్నా మూర్తి మాత్రం తన మాటపై తాను నిలబడుతూనే ఉన్నారు. దేశం కోసం యువత కష్టపడాల్సిందేనని చైనాలోని పని విధానాన్ని తాజాగా ఉదహరించారు. 

తాజాగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత యువత కష్టపడి, ఎక్కువ పని చేస్తేనే దేశం వేగంగా ఎదగగలదని వ్యాఖ్యానించారు. ఇది మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా 9-9-6 పని సంస్కృతిని ఈ సందర్భంగా మూర్తి ఉదహరించారు. 

చైనాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు.. వారంలో 6 రోజుల పనిచేసే విధానం అమలులో ఉంది. అంటే ఈ లెక్కన వారానికి వారు 72 గంటల పనిచేస్తారు. ఇది మూర్తి 2023లో సూచించిన వారానికి 70 గంటల పని విధానానికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందాలంటే ఇక్కడి యువత కూడా చైనాలో మాదిరిగా ఎక్కువ గంటల పాటు కష్టపడాలని అన్నారు.  

ALSO READ : ఇన్కమ్ టాక్స్ రీఫండ్ ఇంకా రాలేదా..

తాజా వ్యాఖ్యలతో మూర్తి అభిప్రాయాన్నే మరింతగా బలపరుస్తూ.. చైనా వేగంగా అభివృద్ధి చెందిన విధానాన్ని ఉదాహరణగా చెప్పారు. చైనాలోని అలిబాబా, హువావే వంటి టెక్ కంపెనీల్లో 9-9-6 సంస్కృతి అమలయ్యింది. అయితే, అధిక ఒత్తిడి ఒత్తిడితో కూడిన పని వాతావరణం కారణంగా దానిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. 2021లో చైనా సుప్రీంకోర్టు ఈ పద్ధతిని చట్టవిరుద్ధంగా ప్రకటించినా.. ఆచరణలో ఇంకా మార్పు పూర్తిగా రాలేదని నివేదికలు చెబుతున్నాయి.

భారతీయ యువత ముందుగా జీవితాన్ని నిర్మించుకోవాలని, ఆ తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై దృష్టి పెట్టాలని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిలుపునిచ్చారు నారాయణమూర్తి. భారతదేశం చైనాను అధిగమించటానికి ప్రతి పౌరుడి నుంచి అసాధారణమైన కృషి అవసరమని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అలాగే చైనాతో సమానంగా ఎదగాలంటే అన్ని స్థాయిల్లో కఠినమైన ప్రమాణాలు పెట్టుకోవాల్సిందేనని అన్నారు.