- ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ట్రాఫిక్ ఆపడంపై ఆగ్రహం
- వెంటనే కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
- ఇకపై సీఎం, మంత్రుల కాన్వాయ్ కోసం సింగిల్ లైన్ ట్రాఫిక్ నిర్వహించాలని ఆర్డర్
హైదరాబాద్, వెలుగు: సీఎం, మంత్రుల కాన్వాయ్‌కోసం సామాన్య ప్రజలకు ట్రాఫిక్ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు. తమ పర్యటనల సందర్భంగా ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని డీజీపీకి సూచించారు. సీఎం రేవంత్ బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.
అయితే, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శిల్ప లేఅవుట్ వద్ద కాన్వాయ్ వెళ్తున్న రూట్‌తో పాటు పక్క రూట్‌లో (డివైడర్‌కు అవతలి వైపు) కూడా పోలీసులు వాహనాలు నిలిపివేశారు. దీంతో ఫ్లై ఓవర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని డీజీపీ సీవీ ఆనంద్‌కు సూచించారు.
ప్రణాళికలు సిద్ధం చేయాలి: డీజీపీ
సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా కాకుండా, సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో త్వరలోనే ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఇందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ లేకుండా చూడాలని, ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల విభాగం అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని పోలీసు సిబ్బందిని డీజీపీ ఆదేశించారు.
