
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష
- సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచన
- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అలర్ట్ గా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
వర్షాలపై సీఎస్, ఉన్నతాధికారులతో సీఎం శుక్రవారం ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సీఎం ఆదేశాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఎస్, డీజీపీతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిసిన.. ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇరిగేషన్, రవాణా, విద్యుత్, హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో పనిచేసి జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. దసరాకు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళతారని, వారి రవాణాకు ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలన్నారు.
జంట జలాశయాలకు వరదపై జాగ్రత్త..
మూసీలో నీటి ఉధృతి పెరుగుతున్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వస్తున్న వరదను అంచనా వేసి అంతే పరిమాణంలో దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. నీటి విడుదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని, అవసరమైతే షెల్టర్ హోమ్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని, రాబోయే వర్షాల వల్ల చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.