భూకబ్జాలు.. డ్రగ్స్ మాట వినిపించొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

భూకబ్జాలు.. డ్రగ్స్ మాట వినిపించొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

‘‘పోలీస్ శాఖకు, అధికారులకు నేను ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్న. భూకబ్జాలు, డ్రగ్స్ వంటివి మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది” అని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ‘‘గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు.  ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడొచ్చి ఇక్కడి యువతను ఆక్రమించుకుంటున్నయ్​.  ఇది అత్యంత ప్రమాదకరం.  రాష్ట్రంలోని చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, గంజాయి దొరుకుతున్నది. జూనియర్ కాలేజీల్లో, స్కూళ్లలో కూడా మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినయ్.. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి..  ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం క్షమించదు.  మీరు గతంలో తీవ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించడానికి ఏ రకంగా చర్యలు తీసుకున్నారో.. ఇప్పుడు  డ్రగ్ మహమ్మారిని కూడా నిర్మూలించేందుకు అట్లనే పనిచేయాలి” అని ఆయన అధికారులకు సూచించారు. ‘‘అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించాం. కింది స్థాయి వ్యవస్థలను కూడా బలోపేతం చేసే అధికారులను నియమిస్తాం.  నార్కోటిక్ బ్యూరో అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. మన కండ్ల ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం కనిపిస్తున్నది.

 తెలంగాణ.. పంజాబ్ రాష్ట్రం వంటి పరిణామాల వైపు వేగంగా ప్రయణిస్తున్నది. డ్రగ్స్​, గంజాయిని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులది. ఎక్కడ ఏమి జరుగుతున్నదో పోలీస్ అధికారుల వద్ద సమాచారం ఉందో లేదో కానీ, స్వయంగా నా దగ్గర కొంత సమాచారం ఉంది. గంజాయి మన దగ్గర పండించేది చాలా తక్కువగా ఉండొచ్చు..  కానీ వినియోగించేది ఎక్కువైంది.  లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒక్కటే కాదు మీరు చేసే పని.. ప్రతి జిల్లా ఎస్పీ పట్టాణాలు, మండలాల్లో గంజాయి, డ్రగ్స్​పై నిఘా పెట్టాలి. ఇందుకోసం  ప్రత్యేకంగా అధికారులను నియమించుకోవాలి. సమాచారాన్ని సేకరించాలి. డ్రగ్స్​, గంజాయి దందాలో ఎవ్వరినీ వదలడానికి వీల్లేదు” అని సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు పెంచే సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తుంటారని, వారిపై కూడా కన్నేసి ఉంచాలని సూచించారు. ఇలా చేసేవారి సమాచారం సేకరించి, వారందరినీ ఒక లైన్ లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.