
తనకు రాజకీయాల్లో శత్రువులెవరూ లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను శత్రువుగా చూడాలన్నా ఆ వ్యక్తికి అంతటి స్థాయి ఉండాలని చెప్పారు. వ్యక్తిగత పగకోసం తన పదవిని అడ్డం పెట్టుకుంటే తనకన్నా మూర్ఖుడు ఇంకొకరు ఉండరని చెప్పారు. శత్రువులకు తన గెలుపే అసలైన శిక్ష అని అన్నారు. తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానన్న సీఎం రేవంత్.. ఎవడి పాపాలకు వాడే బలైపోతారని చెప్పారు.
అందెశ్రీ రాసిన హసిత బాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తనకు అన్ని చట్ట సభల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. అద్దాల మేడలు అభివృద్ధి కాదని.. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరినప్పుడే అసలైన విజయం అని అన్నారు. నిజమైన ఉద్యమకారులెవరూ ఉద్యమకారుడినని చెప్పుకోరని..సర్వం కోల్పోయినా లక్ష్యం వైపు వెళ్తారని చెప్పారు రేవంత్. ఉద్యమకారులని చెప్పుకునే వాళ్లకు అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణతో పేగు బంధం,పేరు బంధం అన్ని తెంచుకున్నారని విమర్శించారు. దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో అన్నీ కోల్పోయారని అన్నారు.
►ALSO READ | మార్వాడీ గోబ్యాక్ అంటూ.. ఆగస్టు 18న అమనగల్లు బంద్ కు పిలుపు
శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక తత్వవేత్త అని అన్నారు సీఎం రేవంత్. పుస్కకావిష్కరణలకు తాను వెళ్లేది తక్కువ అని.. అందెశ్రీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ తెలంగాణ అని అన్నారు రేవంత్. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ తన లక్ష్యమని చెప్పారు సీఎం.