సెమిస్టర్ తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ .. 3 నెలలకోసారి కూడా వేసే ఆలోచన.!

సెమిస్టర్ తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ .. 3 నెలలకోసారి కూడా వేసే ఆలోచన.!
  • ఇప్పటికే  స్టూడెంట్ల ఖాతాల్లో నేరుగా జమచేయాలని ప్రభుత్వ నిర్ణయం
  • విద్యార్థుల  నుంచి కాలేజీలు ఫీజు వసూలు చేసుకోవచ్చన్న  హైకోర్టు
  • జీవో నంబర్​7లోని 12వ నిబంధనపై కొనసాగుతున్న స్టే
  • కౌంటర్​ దాఖలుకు సిద్ధమవుతున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఈ విద్యా సంవత్సరం నుంచి  స్టూడెంట్ల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ జమచేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం  ఏ టైంలో, ఎన్ని వాయిదాల్లో అందించాలనేదానిపై కసరత్తు చేస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి (క్వార్టర్లీ) రీయింబర్స్​ చేయాలా? లేదంటే సెమిస్టర్ వారీగా అందించాలా? అనే అంశంపై తర్జనభర్జన పడుతోంది. అయితే, సెమిస్టర్​వైపే పలువురు అధికారులు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎస్సీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ సభ్యసాచి ఘోష్ నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఉన్నతాధికారుల కమిటీ.. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. విద్యార్థుల  నుంచి మేనేజ్​మెంట్లు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్​7 ప్రకారం స్టూడెంట్ల ఖాతాల్లో రీయింబర్స్​మెంట్ ​సొమ్ము జమ చేశాకే కాలేజీలు ఫీజులు తీసుకోవాలన్న 12వ నిబంధనపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలో మూడు నెలలకోసారి లేదంటే సెమిస్టర్ వారీగా నిధులు విడుదల చేస్తే మేనేజ్​మెంట్ల నుంచి సానుకూలత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 


రాష్ట్రంలో డిగ్రీ, పీజీ , ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, ఎంఈడీ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సులు చదివే సుమారు 12.4 లక్షల మంది విద్యార్థులు ఏటా ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్స్​కోసం  దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 2,500 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. ఈ నిధులను నేరుగా కాలేజీ ఖాతాల్లో జమ చేస్తోంది. కొన్నేండ్లుగా ప్రభుత్వాలు ఇన్​టైంలో ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల చేయకపోవడంతో సుమారు రూ.7,500  కోట్ల బకాయిలు పేరుకపోయాయి. ఈ నిధుల కోసం ఓ వైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న  మేనేజ్​మెంట్లు, మరోవైపు స్టూడెంట్లను ఫీజుల కోసం వేధిస్తున్నాయి. సర్కారు నుంచి వచ్చాక తిరిగి ఇస్తామంటూ ముందే ఫీజులు కట్టించుకుంటున్నాయి. ఫీజులు కట్టని స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాయి. దీనికితోడు కొన్ని కాలేజీల్లో.. లేని స్టూడెంట్లను ఉన్నట్టు చూపి భారీ మొత్తంలో ఫీజు రీయింబర్స్​మెంట్ కొట్టేస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ సమస్యకు చెక్​పెట్టేలా ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ ఖాతాల్లో కాకుండా నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్​మెంట్​జమచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జీవో 7పై యాజమాన్యాల ఆందోళన.. 

స్కాలర్ షిప్​లు, ఫీజు రీయింబర్స్ మెంట్ నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా ఇటీవల జీవో 7ను రిలీజ్ చేసింది. ఈ జీవోలోని 12వ నిబంధన ప్రకారం.. ప్రభుత్వం డైరెక్ట్‌‌ బెనిఫిట్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌(డీబీటీ) పద్ధతిలో ఫీజురీయింబర్స్​మెంట్​ను స్టూడెంట్ల ఖాతాల్లో నేరుగా జమ చేశాకే కాలేజీకి ఫీజులు చెల్లిస్తారని, అప్పటిదాకా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో స్కాలర్‌‌షిప్​లు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ పక్కదారి పట్టకుండా విద్యార్థులకు ఆధార్ గుర్తింపును తప్పనిసరి చేసింది. స్టూడెంట్స్​ ఈపాస్ పోర్టల్‌‌లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలను మాత్రమే పేర్కొనాలి. ప్రతి కాలేజీలో ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. విద్యార్థులు అటెండెన్స్​ శాతాన్ని బట్టి, వారి అకడమిక్ ప్రోగ్రెస్ ఆధారంగా నిధులను విడతల వారీగా విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు పలు కాలేజీల యాజమాన్యాలకు మింగుడుపడడం లేదు. ప్రధానంగా జీవో 7లోని 12వ నిబంధనకు వ్యతిరేకంగా ఇటీవల యాజమాన్యాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిబంధన వల్ల కాలేజీలు ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉండదని, దీన్ని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరాయి. ఈక్రమంలో జూన్‌‌ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మధ్యేమార్గంగా సెమిస్టర్​వారీగా ఎప్పటికప్పుడు ఫీజురీయింబర్స్​మెంట్​ చెల్లిస్తే అటు స్టూడెంట్లకు, ఇటు మేనేజ్​మెంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు స్పష్టమైన షెడ్యూల్‌‌తో కూడిన కౌంటర్ దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.