ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్‌‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్‌‌రెడ్డి
  •     గుర్తింపు, సంక్షేమ ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎం రేవంత్‌‌రెడ్డి
  •     వెబ్‌‌ పోర్టల్ రూపొందించి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఆదేశం
  •     సీఎంతో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ భేటీ
  •     డ్రాఫ్ట్ రిపోర్టు అందజేసిన కమిటీ చైర్మన్ కేకే, కోదండరాం బృందం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి తమ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి గుర్తింపు సంక్షేమ ప్రక్రియను ఎక్కడా ఆలస్యం కాకుండా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కె.కేశవరావు (కేకే) చైర్మన్‌‌గా ఏర్పాటైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతినిధి బృందం శనివారం సీఎం నివాసంలో ఆయనతో సమావేశమైంది. ఈ భేటీలో ఎమ్మెల్సీ కోదండరాం, కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. 

ఇటీవల అమరవీరుల స్మారక చిహ్నమైన ‘అమరదీపం’ వేదికగా దాదాపు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల సారాంశాన్ని, ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదాతో కూడిన సమగ్ర నివేదికను కమిటీ సీఎంకు అందజేసింది. క్షేత్రస్థాయిలో ఉద్యమకారులు వెలిబుచ్చిన ప్రధాన ఆకాంక్షలు, వినతులను ఈ సందర్భంగా సీఎంకు సమగ్రంగా వివరించారు.

కమిటీ అందజేసిన నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్‌‌రెడ్డి ఉద్యమకారుల విజ్ఞప్తుల పట్ల అత్యంత సానుకూలంగా స్పందించి, వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను, తమ భవిష్యత్తును పణంగా పెట్టిన ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రజా ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని సీఎం పునరుద్ఘాటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే జీవో 679 ద్వారా కమిటీని ఏర్పాటు చేశామని, ఉద్యమకారుల గుర్తింపు సంక్షేమ కసరత్తును నిర్దిష్ట కాలపరిమితిలో ముగించాలని అధికారులకు సూచించారు. ఉద్యమకారులకు 250 గజాల నివాస స్థలాలు, ఆసరా తరహా పెన్షన్లు, హెల్త్‌‌కార్డులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యోగులకు గౌరవ గుర్తింపు కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని హామీ ఇచ్చారు.

కమిటీకి వనరులు, సహకారం

ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రత్యేక అధికారిక వెబ్‌‌సైట్ పోర్టల్ రూపొందించాలని, డిజిటల్ దరఖాస్తుల స్వీకరణకు, జిల్లాల వారీ సమన్వయానికి పూర్తి యంత్రాంగాన్ని సమకూర్చాలని హాజరైన ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, సీఎం కార్యదర్శి ఎస్. శ్రీధర్, కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, వి.పి. గౌతమ్, సీఎం ఓఎస్డీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమిటీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు, పరిపాలనా వనరులను వెంటనే కల్పించాలని సీఎస్‌‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యమకారుల చిరకాల ఆకాంక్షల పట్ల సానుకూలంగా స్పందించి, తక్షణ కార్యాచరణకు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎం రేవంత్‌‌రెడ్డికి కేకే, కోదండరామ్, శోభన్ రెడ్డి, రాములు నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.