- ఇలాగే ముందుకెళ్లాలని ఉన్నత విద్యా మండలికి సీఎం సూచన
హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణ ఉన్నత విద్యలో సంస్కరణలు బాగున్నాయి.. ఇదే జోష్‌తో ముందుకెళ్లాలి. మన చదువులు ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉండేలా మండలి చేస్తున్న కృషి అభినందనీయం’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాదిగా మండలి చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన దగ్గర చదువుకున్న స్టూడెంట్లు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ సంస్థలతో పోటీ పడేలా ఉండాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, ఆ దిశగా కౌన్సిల్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని సీఎం కొనియాడారు.
సిలబస్ మార్పులు, మోడ్రన్ టెక్నాలజీని వాడకం, విదేశీ వర్సిటీలతో సంప్రదింపులు జరపడం వంటి విషయాల్లో ఆయనను అభినందించారు. ఇదే ఒరవడి కొనసాగించాలని.. ఇంకేం మార్పులు తెచ్చినా ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటదని సీఎం భరోసా ఇచ్చారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టుగా శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి తెలిపారు.
