అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తా: సీఎం రేవంత్ రెడ్డి

అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తా: సీఎం రేవంత్ రెడ్డి
  • ఆయన పేరుతో స్మృతివనం 
  • ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చుతం
  • కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
  • ఆయన పుస్తకం ‘నిప్పుల వాగు’ను  లైబ్రరీల్లో పెడ్తమని వెల్లడి

సమాజమే కుటుంబమని భావించిన గొప్ప మానవతావాది అందెశ్రీ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  అందె శ్రీ అంతిమ సంస్కారాల తర్వాత  మీడియాతో మాట్లాడారు.  పశువుల కాపరిగా, తాపీ మేస్త్రీగా, కవిగా, రచయితగా.. ఆయన కడదాకా సాధారణ జీవితం గడిపార ని గుర్తు చేశారు.  ఉద్యమకారుడిగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించారని చెప్పా రు. అందెశ్రీ మరణం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. 

“నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందె శ్రీని కలిసి.. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరా. గద్దర్‌‌‌‌‌‌‌‌తోపాటు అందెశ్రీ  కూడా ప్రజల్లో  స్ఫూర్తి రగిలించారు. ఆయన రాసిన ప్రతి పాట తెలంగాణ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. అందుకే అందె శ్రీ  రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటం. ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తం. 

వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన తెచ్చిన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌‌‌‌గా, ఖురాన్‌‌‌‌గా.. తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్ గా ఉపయోగపడుతుంది. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో అందుబాటులో ఉంచుతాం. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని   కేంద్రానికి నిరుడు లేఖ రాశాం. ఈ ఏడాది కూడా రాస్తం. అందె శ్రీకి పద్మశ్రీ  దక్కేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలి”అని సీఎం పేర్కొన్నారు.