ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలు.. భూ సమగ్ర సర్వేతో కొత్త చిక్కులు

 ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలు.. భూ సమగ్ర సర్వేతో కొత్త చిక్కులు

ధరణి కమిటీ ఇచ్చే ఫైనల్​ రిపోర్టు ఆధారంగా రైతుల భూ రికార్డు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయడం, లేదా కొత్త చట్టం తీసుకువచ్చే అంశాలను పరిశీలిద్దామని అధికారులతో ఆయన అన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు.

ధరణి కమిటీతో శనివారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్​వోఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సీఎం సూచించారు. 

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ముఖ్యమంత్రికి ధరణి కమిటీ  నివేదించింది. అప్పుడు కేవలం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని తెలిపింది. ఆ రికార్డులనే అప్పటి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని పేర్కొంది. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది. 

దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి ధరణి కమిటీ తీసుకెళ్లింది. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపింది. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలోని భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది.