- ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలి
- వాహన యజమాని బ్యాంక్ అకౌంట్‌ను సింక్ చేయండి
- పోలీసులు, ఆర్టీఏ, బ్యాంక్ అధికారులు కలిసి ప్రణాళికలు రెడీ చేయండి
- చలాన్లలో డిస్కౌంట్లు ఇవ్వొద్దని పోలీస్ అధికారులకు ఆదేశాలు
- ‘అరైవ్.. అలైవ్..’ ప్రచార కార్యక్రమ ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి
- రోడ్డు భద్రత అందరి బాధ్యత: రవాణాశాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠినంగావ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చలాన్ పడితే వెంటనే ఆయా వాహనాల యజమాని అకౌంట్ నుంచి ఆటోమెటిక్‌గా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే వాహనదారుడి బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, ఆర్టీఏ, బ్యాంక్ అధికారులు కలిసి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇకపై చలాన్ల డిస్కౌంట్లు ప్రకటించవద్దని అన్నారు. రాష్ట్రంలో రోడ్డు భద్రత పెంచేలా ట్రాఫిక్ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి బలోపేతం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రోడ్డు భద్రత పెంచేలా అవసరం మేరకు నూతన చట్టం తీసుకురావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణ నష్టం తగ్గించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డితో కలిసి షార్ట్ ఫిల్మ్ వీడియోలు, పోస్టర్లను ఆవిష్కరించారు.
చెరువులు, నాలాలను దుర్మార్గులు కబ్జా చేశారు
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాం. యువత ప్రాణాలు తీస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వాతావరణ మార్పుల వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలను దుర్మార్గులు ఆక్రమించుకుంటున్నారు. నీళ్లు మనం నివాసం ఉండే కాలనీలకు చేరుతున్నది. చెరువులు, నాలాల కబ్జాలను అరికట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. ఎవరు ఏమనుకున్నా.. ఏంచేసినా.. ఎన్ని విమర్శలు చేసినా పెట్టుకున్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా రోడ్డుభద్రత వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. సాంకేతిక నైపుణ్యం వినియోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి” అని పోలీస్ శాఖను ఆదేశించారు.
రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు: పొన్నం
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పెంచేందుకు పోలీస్, రవాణాశాఖ సంయుక్తంగా మాసోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. స్కూళ్లలోనూ రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్నివర్గాల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. అరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 24 వరకు ఒక్కో రోజు ఒక్కో రోడ్డు భద్రత అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని పది రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, రాజ్‌ఠాకూర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కరి నిర్లక్ష్యం ఎందరి ప్రాణాలనో తీస్తోంది: సీఎం
దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా.. ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం పోతోంది. ఇలా రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీకి 3 శాతం నష్టం వాటిల్లుతోందని సీఎం తెలిపారు. సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఎందరినో బలిగొంటోందన్నారు. ‘‘దేశ సరిహద్దుల్లో సైనికుల కంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎదుటివారు చేసే తప్పుకు అమాయకులు బలవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందితే మనుషుల తప్పులతో జరిగిన హత్యలుగానే పరిగణించాలి” అని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు.
