రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

రిజర్వేషన్ల రద్దుకు మోదీ  కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

రిజర్వేషన్లు రద్దుకు ప్రధాని మోదీ కుట్రచేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. పదేండ్ల బీజేపీ పాలనపై గాంధీ భవన్ లో ప్రజాచార్జ్ షీట్ రిలీజ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్షీ, మంత్రులు కోమటిరెడ్డి, భట్టి ,పొన్నం పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన  సీఎం రేవంత్ రెడ్డి.. రిజర్వేషన్లు ఉండాలా? వద్దా అనే దానికి  ఈ లోక్ సభ ఎన్నికలు రెఫరెండం అని అన్నారు.  బీజేపీ ఒక్క సీటు గెలిచినా  రిజర్వేషన్ల హక్కులను కాలరాస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను కొనసాగిస్తామన్నారు. రిజర్వేషన్లు ఉండాలనేవాళ్ళు కాంగ్రెస్ కి, వద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయాలని సూచించారు.

బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్.  సీఏఏ, ఆర్టికల్ 370రద్దు, రైతుల చట్టాలు .. ఇలా ప్రతిపక్షాలు వద్దని వారించినా కేంద్ర  ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.   ఎస్సీ, ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర  చేస్తుందన్నారు.  రిజర్వేషన్లు రద్దు చేయాలనే భావాజాలంతో ఆర్ఎస్ ర్ఎస్ ఉందన్నారు.   

అప్పుల ఊబిలో నయా భారతాన్ని మోదీ తాకట్టు పెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ . 2014 నుంచి మోదీ ఒక్కరే 113 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు సీఎం రేవంత్.  దేశం మీద 168 లక్షల కోట్లు భారం మోపారని తెలిపారు. జీఎస్టీ పేరుతో పన్నులు విధించి కేంద్రం ప్రభుత్వం దోచుకుంటుందన్నారు.   పిల్లలు వాడే పెన్సిల్ పై కూడా మోదీ జీఎస్టీ వేశారని..భక్తులమని చెప్పుకునే బీజేపీ చివరకు అగరభత్తులపై కూడా జీఎస్టీ వేసిందని విమర్శించారు.  

అదానీ,అంబానీ,అమెజాన్ ల ఒత్తిడిలకు మోదీ సర్కార్ తలొగ్గిందని మండిపడ్డారు రేవంత్ . మోదీ 10 సంవత్సరాలలో ప్రభుత్వం సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మేశారని ఆరోపించారు. రూ.60 ఉన్న పెట్రోల్ రేటును ఇవాళ 110కి పెంచారని .. సామాన్యులు కూడా బతకలేని విధంగా నిత్యవసర ధరలు పెంచారని ధ్వజమెత్తారు.

మళ్లీ మోదీ వస్తే దేశం సర్వనాశనమేనని అన్నారు సీఎం రేవంత్.  దేశసంపదను బీజేపీ ధనవంతులకు దోచిపెట్టిందని మండిపడ్డారు. దేశాన్ని, సంపదను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. . ఢిల్లీ సరిహద్దులో లక్షల మంది రైతులు 16 నెలలు ధర్నా చేశారని ఆరోపించారు. రైతులను ఆదుకుంటామని చెప్పి 3 నల్ల చట్టాలు తెచ్చారని ఆరోపించారు రేవంత్.